వరికుంటపాడు మండలం తూర్పు రొంపిదొడ్లలో విషాద ఘటన,,,కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఒక్కో కుటుంబానికి 25 వేల రూపాయలు అందజేత..!*
వరికుంటపాడు,జనవరి 25,మన ధ్యాస(నాగరాజు కె).

వరికుంటపాడు మండలం, తూర్పు రొంపిదొడ్ల పంచాయతీ పరిధిలోని బోణిగాలరావు పాడు గ్రామంలో జరిగిన విషాదకర ఘటనలో తూర్పు రొంపిదొడ్ల గ్రామ ఎస్టీ కాలనీకి చెందిన మేకల గణేష్, తలపల రమేష్ అనే ఇద్దరు యువకులు విద్యుత్ ఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందారు. పొలం యజమానులు పశువులు, జంతువుల నుండి రక్షణ కోసం కంది చేను చుట్టూ సోలార్ విద్యుత్ తీగలు అమర్చగా, పొలం వెంబడి దారి ఉండటంతో బైక్పై వెళ్తున్న సమయంలో విద్యుత్ తీగ తగలడంతో ఈ ప్రమాదం జరిగింది.ఈ ఘటనలో బైక్ కూడా పూర్తిగా దగ్ధమైంది. ఈ దుర్ఘటన గురించి సంబంధిత విద్యుత్ శాఖ, మరియు పోలీస్ శాఖ వారిని పూర్తిస్థాయిలో నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయవలసినదిగా ఎమ్మెల్యే ఆదేశించారు.అనంతరం ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ వారి స్వగ్రామానికి వెళ్లి, కుటుంబ సభ్యులను పరామర్శించి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ దుర్ఘటన గురించి విద్యుత్ శాఖ మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు కి తెలియజేసి ప్రభుత్వం తరఫున ఒక్కో కుటుంబానికి 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందే విధంగా చూస్తామని హామీ ఇచ్చారు.అలాగే మృతి చెందిన వారి కుటుంబాలకు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అండగా ఉంటూ, అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఒక్కొక్క కుటుంబానికి ₹25,000 చొప్పున మొత్తం ₹50,000 రూపాయలను అందజేశారు. అదే విధంగా మండల నాయకులు కూడా ఇరు కుటుంబాలకు ₹25,000 చొప్పున ఆర్థిక సహాయం అందించారు.ఇలాంటి విషాద ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
