పెనుకొండ, మనధ్యాస: శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం సోమందేపల్లి మండలం కొత్తపల్లి గ్రామ శివారులో రాత్రింబవళ్లు అక్రమంగా మట్టి తరలిస్తూ కోట్ల రూపాయల ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారని మాజీ మంత్రి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు, పెనుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఉషశ్రీ చరణ్ ఆరోపించారు. అక్రమ తవ్వకాలను తక్షణమే ఆపాలని కోరుతూ మాగేచెరువు పంచాయితీ కొత్తపల్లి గ్రామస్తులతో కలిసి ఆమె కొత్తపల్లి చెరువును పరిశీలించారు.చెరువులో అక్రమంగా తవ్వకాలు చేపట్టిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులతో కలిసి చెరువులో ధర్నా నిర్వహించారు. అనంతరం ఎంఆర్వో కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి ఎంఆర్వోకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఉషశ్రీ చరణ్ మాట్లాడుతూ, పెనుకొండ నియోజకవర్గంలో ఎక్కడ చూసినా చెరువులు, కొండలు, కుంటల నుంచి అక్రమంగా మట్టి తరలించడమే కూటమి నాయకుల ప్రధాన పనిగా మారిందని విమర్శించారు.కొత్తపల్లి గ్రామంలో స్మశానవాటికకు వెళ్లే దారిని కూడా తమ స్వలాభం కోసం చెరువులో అక్రమంగా తవ్వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించకపోవడం బాధాకరమన్నారు. అక్రమ మట్టి తరలింపును ప్రశ్నించిన గ్రామస్తులపై అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో కలెక్టర్ కార్యాలయాన్ని పెద్ద ఎత్తున ముట్టడిస్తామని ఆమె హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *