oplus_32

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరద పెరుగుతూనే ఉంది.ఆదివారం నాటికి ప్రాజెక్టులోకి 1,30,144 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో చేరింది. దీంతో ప్రాజెక్టు వీర్ నంబర్–4లో 10 గేట్లు, వీర్ నంబర్–5లో 4 గేట్లు, వరద గేట్లలో 7 గేట్లు కలిపి మొత్తం 21 వరద గేట్లను ఎత్తివేసి, 1,52,044 క్యూసెక్కుల నీటిని దిగువ మంజీరా నదిలోకి విడుదల చేస్తున్నట్లు నీటిపారుదల శాఖ ఏఈ సాకేత్ తెలిపారు.ప్రస్తుతం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1405.00 అడుగులు కాగా,ప్రస్తుత నీటిమట్టం 1401.40 అడుగులుగా ఉంది.17.802 టీఎంసీల సామర్థ్యానికి గాను, 12.954 టీఎంసీల నీటిని నిల్వ ఉంచారు.అదనంగా ప్రధాన కాలువ ద్వారా 900 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.30 సంవత్సరాల తర్వాత ఇంతటి భారీ వర్షపాతం కురవడం వల్ల వరద ప్రవాహం నిరంతరంగా కొనసాగుతోందని అధికారులు తెలిపారు.ప్రస్తుత పరిస్థితులు దృష్ట్యా,మరికొన్ని రోజులు వరద గేట్ల ద్వారా భారీగా నీరు విడుదల అవుతుందని హెచ్చరించారు.ఈ నేపథ్యంలో ప్రజలు ఎవరూ నీటి ప్రవాహం వైపు వెళ్లకూడదని,జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు మళ్లీ హెచ్చరికలు జారీ చేశారు.ప్రత్యేకంగా మంజీరా నది పరివాహక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

By RAHEEM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *