పినపాక నియోజకవర్గం, మన ధ్యాస : రాబోయే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని జడ్పిటిసి, ఎంపిటిసి, సర్పంచుల స్థానాలలో గెలిపించుకోవాలని శనివారం పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కార్యకర్తలను కోరారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలోని జివిఆర్ ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని శనివారం నిర్వహించారు. ప్రతి కార్యకర్తకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. కాంగ్రెస్ కార్యకర్తలు నాయకుల వల్లనే తాను గెలిచానని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ జెండాను కార్యకర్తలే ఎగరవేశారని తెలియజేశారు. ప్రతి ఒక్కరు స్థానిక సంస్థల ఎన్నికల్లో ధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో కాంగ్రెస్ పథకాలను ప్రజలకు తెలియజేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు ఆపదలో ఉంటే ఎప్పుడైనా తాను అండగా ఉంటానన్నారు. మండల వ్యాప్తంగా 23 సర్పంచులు, 11 ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలుగా కాంగ్రెస్ కార్యకర్తలు పోటీ చేయనున్నారని తెలిపారు. వారిని గెలిపించుకోవాల్సిన అవసరం కాంగ్రెస్ కార్యకర్తగా మనపై ఉందని తెలియజేశారు. 7000 పుస్తకాలు చదివిన పెద్దమనిషి ఇవాళ చతికల్పడ్డాడని, వాళ్ల కుటుంబంలో ఆస్తుల గొడవ మొదలైందన్నారు. రాష్ట్రాన్ని దోచుకోవడంలో ఉన్న శ్రద్ధ అభివృద్ధిపై పెట్టలేదన్నారు. దొరల పాలన, కుటుంబ పాలన, గడిలపాలన నుండి తెలంగాణ ప్రజలకు విముక్తి లభించిందని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకొని కాంగ్రెస్ పథకాలను ప్రజలకు తెలపాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం గొప్ప గొప్ప పథకాలను ప్రవేశపెడుతుందనన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు గొడిశాల రామనాథం, మాజీ వైస్ ఎంపీపీ కంది సుబ్బారెడ్డి, మాజీ ఎంపీపీ నాగయ్య, గంగిరెడ్డి వెంకటరెడ్డి, గంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, పేరం వెంకటేశ్వరరావు, ఉడుముల లక్ష్మారెడ్డి, మాజీ పినపాక నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కోర్స ఆనంద్, యూత్ మండల అధ్యక్షులు మనోజ్, మాజీ ఎంపీటీసీ శివ, మాజీ ప్రజా ప్రతినిధులు, మండల ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
