మన ధ్యాస, పెనుమూరు మండలం:-గంగాధర నెల్లూరు నియోజకవర్గం పెనుమూరు మండలం గుడ్డేనంపల్లి పంచాయతీ కొటార్లపల్లి ఏ.ఏ.డబ్ల్యు గ్రామంలో ఆదివారం మాతమ్మ తిరునాళ్లు ఘనంగా నిర్వహించబడ్డాయి. ప్రతీ ఏటా జరుగుతున్న ఈ గ్రామ దేవత ఉత్సవాలను స్థానికులు ఎంతో భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు. ఈసారి కూడా ఉదయం నుంచే గ్రామమంతా ఉత్సాహపూర్వక వాతావరణం నెలకొంది.ఈ సందర్భంగా నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు గురుసాల కిషన్ చంద్ కుటుంబ సమేతంగా తిరునాళ్లలో పాల్గొని అమ్మవారికి బట్టలు సమర్పించారు. గ్రామ పెద్దలు, మహిళలు, యువత ఆయనను ఆత్మీయంగా ఆహ్వానించి సత్కరించారు. భక్తిపూర్వకంగా అమ్మవారికి అర్చనలు చేసి గ్రామ శ్రేయస్సు, ప్రజల క్షేమం కోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు.కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ గుర్రప్ప యాదవ్, టిడిపి యువ నాయకులు రెడ్డికుమార్ యాదవ్ సుబ్రహ్మణ్యం, హరి తదితరులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు చేరడంతో ఉత్సవ ప్రాంగణం కిక్కిరిసిపోయింది.ఈ సందర్భంగా గురుసాల కిషన్ చంద్ మాట్లాడుతూ –
“గ్రామ దేవతలు మనకు ఆధ్యాత్మిక బలం, సామాజిక ఐక్యతకు ప్రతీకలు. ఈ మాతమ్మ తిరునాళ్లు గ్రామస్తులందరినీ ఒక తాటిపైకి తీసుకువస్తాయి. నేను కుటుంబ సమేతంగా పాల్గొని అమ్మవారి ఆశీర్వాదం పొందడం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను. గ్రామ అభివృద్ధి కోసం ఎప్పటికప్పుడు నా వంతు కృషి చేస్తాను” అని తెలిపారు. తిరునాళ్లలో భాగంగా పల్లకి ఊరేగింపు, పూజా కార్యక్రమాలు, సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించగా, చిన్నపిల్లల నుంచి పెద్దల దాకా అందరూ ఉత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. భక్తులకు అన్నప్రసాద వితరణ కూడా జరిగింది. గ్రామం మొత్తం పండుగ వాతావరణంలో కళకళలాడుతూ, సాంప్రదాయ శోభను చాటిచెప్పింది.