తిరుపతి, ఆగస్టు 1: ఈ నెల 2వ తేదీన జరగనున్న యూపీఎస్సీ కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేసినట్లు జిల్లా రెవెన్యూ అధికారి జి. నరసింహులు తెలిపారు. శనివారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాలులో అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని శ్రీ పద్మావతి బాలికల ఉన్నత పాఠశాల, శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాల (విభాగం-ఎ, విభాగం-బి) అను 3 కేంద్రాలలో మొత్తం 1,093 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారని వెల్లడించారు. ఉదయం 09:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 02:00 నుండి సాయంత్రం 04:00 వరకు పరీక్షలు జరుగుతాయని తెలిపారు. పరీక్షా కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు, వాచ్లకు అనుమతి లేదని స్పష్టం చేశారు. అభ్యర్థుల సౌకర్యార్థం ప్రత్యేక ఆర్టీసీ బస్సులు, విద్యుత్, తాగునీటి వసతులతో పాటు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో కేంద్ర పరిశీలకులు శ్రీమతి ఎన్. వసంత, రాష్ట్ర పరిశీలకులు శ్రీ బి. ఆనంద్ పాల్గొన్నారు

