

- ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ *
- ఉచిత బస్సు స్త్రీ శక్తి పధకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
శంఖవరం మన న్యూస్ ప్రతినిధి:-
నేడు మన యావత్ దేశ 140 కోట్ల భారత పౌరులు అనుభవిస్తున్న ఈ స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలు స్వాతంత్ర్య సమరయోధుల త్యాగ ఫలమేనని కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ పేర్కొన్నారు. ఏలేశ్వరం మండల ప్రజా పరిషత్తు కార్యాలయంలో ఎంపీపీ గొల్లపల్లి నరసింహమూర్తి(బుజ్జి) ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన 79 వ స్వాతంత్ర్య దినోత్సవం వేడుకల్లో ఎమ్మెల్యే సత్యప్రభ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. భారత రత్న, పూజ్య బాబా సాహెబ్, భీమారావ్ రాంజీ అంబేద్కర్, జాతిపిత, మహాత్మా మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీ చిత్రపటాలకు పూల మాలలను వేసి ఘనంగా నివాళులు అర్పించారు. వారి దివ్య స్మృతికి అంజలి ఘటించారు. వారి దేశ సేవలను స్మరించుకున్నారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జాతీయ జెండాకు వందనాన్ని సమర్పించారు. అనంతరం సభికులను ఉద్దేశించి ఎమ్మెల్యే ప్రసంగించారు. పరదేశీయుల పాలన నుంచి మన దేశ విముక్తి, స్వేచ్ఛా, స్వాతంత్రాల కోసం ప్రాణత్యాగం చేసి అమరులైన స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను మరువ లేమన్నారు. ఈ రోజు మనం అనుభవిస్తున్న ఈ ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ , స్వాతంత్ర్యాలు ఎందరో మహనీయుల పోరాటాలు, త్యాగాలు ఫలితం అన్నారు. వారి త్యాగాలను స్మరించుకుంటూ, ఈ దేశ పౌరుల భవిష్యత్తు నిర్మాణానికి పునాదులు వేసుకుంటూ, వికసిత్ భారత్ వైపు సమాజం అడుగులు వెయ్యాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపి తీపి తినుబండారాలను పంపిణీ చేశారు. ఇదే కార్యక్రమంలో మండలంలోని పేరవరం గ్రామానికి చెందిన నిమ్మకాయల అప్పన బాబు, సూరిబాబులతో ఐదుగురు సభ్యుల రైతు సంఘానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయశాఖ రాయితీ ధరకు సరఫరా చేసిన డ్రోనును ఎమ్మెల్యే అందజేసారు. రైతులకు మేలు చేయాలనే లక్ష్యంతో ఎన్డీఏ ప్రభుత్వం పని చేస్తున్నదని ఎమ్మెల్యే అన్నారు. అందులో భాగంగానే వ్యవసాయ పంటలకు మందులను పిచికారీ చేయడానికి ఉపయోగించే రూ. 10,000,00 విలువ చేసే డ్రోనును కేవలం రూ. 2,000,00 లకే అందించింది అన్నారు. ఒక్కో డ్రోన్ పై రూ. 8,000,00 లను రాయితీని రైతుల తరఫున ప్రభుత్వమే భరిస్తోంది అన్నారు. వ్యవసాయాన్ని యాంత్రీకరించాలి తద్వారా రైతులు ఉత్తమ ఫలితాలు సాధించాలనే లక్ష్యంతో ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే అన్నారు. 2024 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి పార్టీలు ప్రకటించిన మేనిఫెస్టోలోని సూపర్ సిక్స్ పధకాల హామీల అమలులో భాగంగా రాష్ట్రంలో అంతర్గతంగా వివిధ జిల్లాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ రోడ్డు రవాణా సంస్థ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించే స్త్రీ శక్తి పధకాన్ని ఎమ్మెల్యే సత్యప్రభ ప్రారంభించారు. ఏలేశ్వరం ఆర్టీసీ డిపోలో ఉచిత బస్సుకు పురోహితులు శాస్త్రోక్తంగా పూజలను చేసారు. అనంతరం బస్సుకు ఎమ్మెల్యే టెంకాయలు కొట్టి పధకాన్ని ప్రారంభించారు. మహిళలకు ఉచిత ప్రయాణ జీరో టిక్కెట్లను ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ పంపిణీ చేశారు. స్త్రీ శక్తి పధకాన్ని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి చిత్ర పటానికి ఎమ్మెల్యే క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమాల్లో రైతులు, ఎన్డీఏ కూటమి శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.