

శంఖవరం/ కాకినాడ మనన్యూస్ ప్రతినిధి:- ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం శంఖవరం నుంచి వేళంగి గిరిజన గ్రామం వరకూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సు సౌకర్యాన్ని పునరుద్ధరించాలని కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కి గిరిజనులు శుక్రవారం విజ్ఞప్తి చేశారు. గత 8 ఏళ్ళుగా తమ గ్రామాలకు కనీస బస్సు సౌకర్యం లేక ఎంతో వెతల్ని భరించాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. విద్య, వైద్యం, ఉపాధి వంటి అవసరాల కోసం సమీప పట్టణాలకు వెళ్లాలంటే వారికున్న ఏకైక దారి నడకే అవుతుందని పేర్కొన్నారు. ముఖ్యంగా శంఖవరం నుండి కొత్తపల్లి, గౌరంపేట, శృంగధార, కొత్త అచ్చంపేట, వేరకపురం, పి మల్లాపురం, వేళంగి, సిద్ధివారిపారం, ఆవేల్తీ అనుమర్తి, మాసంపల్లి, రాజవరం, గొంధి కొత్తపల్లి గ్రామాల ప్రజలు బస్సు రాకపోవడం వల్ల మౌలిక సదుపాయాలకూ నోచుకోలేక పోతున్నారని తెలిపారు. ఈ ప్రాంతానికి కనీసం కాకినాడ డిపో నుంచి లేదా తుని డిపో నుంచి రోజువారీ బస్సు సర్వీసులు అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. రోజుకి కనీసం ఒకటి లేదా రెండు బస్సులు అయినా నడిపితే ప్రజలకు ప్రయాణ సౌలభ్యం లభిస్తుందనీ, అభివృద్ధికి మార్గం సుగమం అవుతుందనీ పేర్కొన్నారు. దశాబ్దాలుగా వారు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఎంపీకి వివరించారు. కేంద్ర, రాష్ట్ర నిధులతో మా గిరిజన గ్రామాల అభివృద్ధి చర్యలు చేపట్టాలని వారు కోరారు. అదే కాకుండా, ఈ మండల పరిధిలోని 59 గిరిజన గ్రామాలను 5 వ షెడ్యూల్ గ్రామాలుగా గుర్తించి పునరావాసం, భూమి హక్కులు, ఆదివాసీ సంక్షేమ పథకాలు అమలులో తక్షణ చర్యలు తీసుకోవాలని ఎంపీని కోరారు. ఈ మేరకు సమగ్ర నివేదిక, వినతి పత్రాన్ని కూడా సమర్పించారు. దీనికి సానుకూలంగా ప్రతిస్పందించిన ఎంపీ సంబంధిత అధికారులతో చర్చించి త్వరిత గతిన పరిష్కిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో విజయవాడ రైల్వే డివిజనల్ సంప్రదింపుల కమిటీ సభ్యులు, జనసేన నాయకులు గొర్లి నాగేశ్వరరావు, గ్రామస్తులు మాడెం లక్ష్మణరావు, జర్తా సరస్వతి, జర్తా సీత, కోసూరి బుల్లమ్మ, కోసూరి వెంకటలక్ష్మి,జర్తా కన్నారావు దేవుడు పాల్గొన్నారు.