మన న్యూస్: పినపాక ఈ ఏడాది చలి తీవ్రత పెరగటం, చల్లటి గాలులు వీచటం, ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోవడం వలన శీతాకాలం సమీపించిన వేళ ప్రతి ఒక్కరు ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలని తద్వారా అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ఉంటాయని పినపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రభుత్వ వైద్యాధికారిణి దుర్గ భవాని తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆమె మాట్లాడుతూ ఉన్ని దుస్తులు ధరించటం ,వేడి చేసిన నీటిని త్రాగటం, ఉదయం ఎండలో నిలబడటం మూలాన చలి నుంచి రక్షించుకోవచ్చు అని అంతేకాకుండా డి విటమిన్ కూడా సమృద్ధిగా లభిస్తుందని అన్నారు. శీతల పానీయాలకు దూరంగా ఉండాలని, చలి అధికంగా ఉండే సమయాల్లో ప్రయాణాలకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, వీలైనంత మేరకు చలి తీవ్రత ఉండే సమయాల్లో ప్రయాణాలను ఆపుకుంటే మంచిదని తెలిపారు .ప్రతిరోజు వేడి నీటితో రెండుసార్లు స్నానం చేయడం, శరీరానికి కావలసినంత త్రాగునీటిని తీసుకోవాలని తద్వారా డీహైడ్రేషన్కు గురి కాకుండా ఉంటామని ,పండ్లు, కూరగాయలు, ఆకుకూరలతో కూడిన ఆహారాలను తీసుకోవడం మూలాన ఆరోగ్యంగా ఉంటామని తెలిపారు. చల్లటి వాతావరణం మూలాన జలుబు, దగ్గు, గొంతు నొప్పి, ఆయాసం పెరిగే అవకాశాలు ఉంటాయని, శ్వాసకోస వ్యాధులు కలిగిన వారు జాగ్రత్తలు తప్పనిసరి అని ,గతంలో జలుబు ,దగ్గు వస్తే ఐదు ఆరు రోజుల్లో తగ్గిపోయేదని కానీ ప్రస్తుత రోజుల్లో వారం లేదా రెండు వారాలు సమయం పడుతుందని అన్నారు. ఆస్తమా ,న్యుమోనియా వంటి వ్యాధులు కలవారు ఈ కాలంలో తగు జాగ్రత్తలు పాటించాలని, తమ ఆరోగ్యం పై అనుమానం వస్తే వెంటనే ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్దకు వచ్చి అన్ని రకముల పరీక్షలు చేయించుకొని తగు మందులను తీసుకువెళ్లాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed