

మనన్యూస్,ఎల్.బి.నగర్:నియోజకవర్గ అభివృద్ధి ప్రదాతపై నికృష్టపు ఆరోపణలు మానుకోవాలి.బీజేపీ,కాంగ్రెస్ కార్పొరేటర్లది అసంబద్ధ సంబంధం.కలెక్షన్ కింగ్‌లుగా మారిన బీజేపీ,కాంగ్రెస్ కార్పొరేటర్లు.
కాంగ్రెస్ ఇన్‌చార్జి చేతిలో కీలుబొమ్మలు బీజేపీ కార్పొరేటర్లు.బీజేపీ,కాంగ్రెస్ కార్పొరేటర్ల తోలు బొమ్మలాట తతంగం ప్రజలకు తెలుసు.
ఎల్.బి.నగర్.నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు ఆలేటి రంగేశ్వరి.
నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత,ఎల్.బి.నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డిపై నికృష్టపు ఆరోపణలు మానుకోవాలని కాంగ్రెస్,బీజేపీ కార్పొరేటర్లపై ఎల్.బి.నగర్ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు ఆలేటి రంగేశ్వరి గారు మండిపడ్డారు.ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసిన బీజేపీ,కాంగ్రెస్ కార్పొరేటర్లు ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డిపై బురద జల్లడమే ప్రధాన అజెండాగా పని చేస్తున్నారని దుయ్యబట్టారు.కార్పొరేటర్లుగా గెలిచినప్పటి నుంచి ఒక్కటంటే ఒక్క పని కూడా సొంతంగా చేయించలేని వెన్నెముక లేని బీజేపీ,కాంగ్రెస్ కార్పొరేటర్లు ప్రజల దృష్టి మరల్చడానికి ఎమ్మెల్యేపై అసంబద్ధ ఆరోపణలు చేస్తున్నారన్నారు.సిద్ధాంతపరంగా పూర్తి వైరుధ్యాలున్న బీజేపీ,కాంగ్రెస్ పార్టీల కార్పొరేటర్లు ఎల్.బి.నగర్ నియోజకవర్గంలో మాత్రం చెట్టాపట్టాలు వేసుకోవడంలోని మతలబు ఏమిటో నియోజకవర్గ ప్రజలకు తెలుసునన్నారు.ప్రజా జీవితంలో సుదీర్ఘ అనుభవమున్న సుధీర్‌రెడ్డిపై అనవసరపు ఆరోపణలు చేస్తే తామేదో పెద్దవాళ్లము అయిపోతామనుకోవడం బీజేపీ,కాంగ్రెస్ కార్పొరేటర్ల అవగాహన లేమికి నిదర్శనమన్నారు.తమ అసమర్థతను కప్పిపుచ్చుకోవడం కొరకు ఎమ్మెల్యేపై అనవసరపు ఆలోపణలు చేస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు.నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి కనుసన్నల్లో పని చేస్తున్న బీజేపీ,కాంగ్రెస్ కార్పొరేటర్ల తతంగాన్ని మొత్తం నియోజకవర్గ ప్రజలు గమనిస్తున్నారని,సమయం వచ్చినపుడు కర్రు కాల్చి వాత పెడతారన్నారు.ప్రజాసేవను మరచిపోయిన బీజేపీ,కాంగ్రెస్ కార్పొరేటర్లు కలెక్షన్ కింగ్‌లుగా మారిపోయారన్నారు.తమ తమ డివిజన్‌లలో ఎక్కడ కొత్తగా ఇల్లు నిర్మించాలన్నా కార్పొరేటర్లకు తాయిలాలు ముట్టజెప్పాల్సిందేనన్నారు.కార్పొరేటర్ల చేయి తడపనిదే ఇటుక పెట్టే పరిస్థితి లేదన్నారు.ఒక మహిళా కార్పొరేటర్ ఎప్పుడు ఏ పార్టీలో ఉంటుందో ఆమెకే తెలియదన్నారు.దాదాపు నాలుగు సంవత్సరాల కాలంలో ముచ్చటగా మూడు పార్టీలు మారిన గొప్ప మహానటి ఈమే.వానాకాలం,ఎండాకాలం,చలికాలం మాదిరిగా ఆ మహిళా కార్పొరేటర్‌కు మాత్రం ప్రత్యేకంగా ఎన్నికల కాలం ఉంటుందన్నారు.మహిళను కాబట్టే తనను అవమానిస్తున్నారని చీటికి మాటికి గగ్గోలు పెట్టే సదరు మహిళా కార్పొరేటర్ చేసే పనులు మాత్రం సిగ్గుచేటన్నారు.ప్రతీ విషయంలో తన సామాజికవర్గాన్ని తెరమీదకు తెచ్చే మహిళా కార్పొరేటర్ చేసే పనులు ఎలాంటివో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని రంగేశ్వరి సూచించారు.నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి చేతిలో కీలు బొమ్మలైన బీజేపీ,కాంగ్రెస్ కార్పొరేటర్లు ఆడుతున్న తోలు బొమ్మలాట తతంగం మొత్తాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు.ఆకాశంపై ఉమ్మి వేస్తే తమ మీదనే పడుతుందనే విషయాన్ని గుర్తెరిగి,ఇప్పటికైనా శిఖర సమానులైన సుధీర్‌రెడ్డి గారిపై అనవసరపు ఆరోపణలు మానుకోవాలని కాంగ్రెస్,బీజేపీ కార్పొరేటర్లకు సూచించారు.లేదంటే ప్రజల చేతిలో ఛీత్కారానికి గురికాక తప్పదని రంగేశ్వరి హెచ్చరించారు.
