

తిరుపతి, నవంబర్ 11,(మన న్యూస్ ) కడపలో రెండు రోజుల క్రితం ముస్లిం మైనార్టీ నాయకుడు బాషా అనే వ్యక్తి ఓ సమావేశంలో భాగంగా నాయి బ్రాహ్మణులను కులం పేరుతో దూషించడం జరిగింది. కావున అతనిని చట్టపరంగా కఠినంగా శిక్షించాలని తిరుపతి నాయి బ్రాహ్మణ సేవా సంఘం నగర అధ్యక్షుడు శిబ్యాల సుధాకర్ డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఏ కార్యక్రమానికైనా నాయి బ్రాహ్మణులు లేకుండా ఆ కార్యక్రమం జరగదు. ఇది తరతరాలుగా వస్తున్న ఆనవాయితీ అన్నారు. అలాంటి నాయి బ్రాహ్మణులను కొందరు అవగాహన రహిత్యంతో తమ కులాన్ని తక్కువ చేసి మాట్లాడటాన్ని తాము ఖండిస్తున్నామన్నారు. ప్రస్తుత టిడిపి కూటమి ప్రభుత్వం తమ నాయి బ్రాహ్మణులను గుర్తించి గౌరవిస్తూ టిటిడి పాలకమండలిలో నరేష్ కుమార్ కు సభ్యుడిగా చోటు కల్పించడం ఆనందంగా ఉందన్నారు. అదేవిధంగా తాజాగా ప్రకటించిన నామినేటెడ్ పదవుల్లో భాగంగా తిరుపతికి చెందిన రుద్రకోటి సదాశివానికి నాయి బ్రాహ్మణ ఫెడరేషన్ చైర్మన్గా పదవి ఇచ్చినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. సమావేశంలో తిరుపతి నాయి బ్రాహ్మణ సేవా సంఘం ప్రతినిధులు కమల్, శివ, జయ కుమార్,వెంకీ, దేవా, తాతారావు, నాగరాజు,గంగాధర్, కుమార్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.