​రేణిగుంట:

ప్రపంచ వృద్ధుల దినోత్సవం (అక్టోబర్ 1) సందర్భంగా మండల వైద్యాధికారి డాక్టర్ చక్రపాణి ఆదేశాల మేరకు రేణిగుంట బిస్మిల్లానగర్‌లోని అభయక్షేత్రం వృద్ధాశ్రమంలో ప్రత్యేక ఆరోగ్య సంరక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ కామరాజు, ఎం ఎల్ హెచ్ పి రేఖ పాల్గొని వృద్ధులకు ఆరోగ్య సూచనలు అందించారు.

​వృద్ధుల ఆరోగ్య సంరక్షణ, సంక్షేమంపై ప్రతి ఒక్కరూ ప్రత్యేక శ్రద్ధ వహించాలని హెల్త్ సూపర్వైజర్ కామరాజు ఆశ్రమ యాజమాన్యానికి సూచించారు. బిపి, షుగర్, గుండె సంబంధిత పరీక్షలు క్రమం తప్పకుండా చేయించుకోవాలని, వైద్యుల సలహా మేరకే మందులు వాడాలని తెలిపారు. పోషకాహారం తీసుకోవడం, తేలికపాటి వ్యాయామాలు, వ్యక్తిగత మరియు పరిసరాల పరిశుభ్రత పాటించడం, జారిపడకుండా జాగ్రత్తలు తీసుకోవడం అత్యంత కీలకమని పేర్కొన్నారు.

​వృద్ధుల అనుభవాలు సమాజానికి ఎంతో ఉపయోగకరమని, వారిని ఆప్యాయంగా చూసుకోవడం అందరి బాధ్యతని తెలిపారు. ఈ సందర్భంగా అభయక్షేత్రానికి నిరంతరం వైద్య సేవలు అందిస్తున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బందికి ఆశ్రమ సంరక్షణ బాధ్యురాలు శ్రీమతి తస్లీమా భాను కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *