మన ధ్యాస ,నిజాంసాగర్,( జుక్కల్ )నిజాంసాగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అచ్చంపేట్ గ్రామ శివారులో గోల్ బంగ్లా సమీపంలో నిర్మాణంలో ఉన్న కాటేజీల్లో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. సాంకేతిక ఆధారాలు, శాస్త్రీయ దర్యాప్తు ఆధారంగా ఇద్దరు నిందితులను అరెస్టు చేసి, దొంగిలించిన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.
బాన్సువాడ రూరల్ సీఐ తిరుపయ్య తెలిపిన వివరాల ప్రకారం.. నిర్మాణంలో ఉన్న కాటేజీల్లో గతంలో పనిచేసిన గట్టు రాకేష్, తమ్మినేని లక్ష్మణ్ రావు అలియాస్ శివ ఉద్యోగం కోల్పోయిన తర్వాత ఆన్‌లైన్ బెట్టింగ్, మద్యానికి అలవాటుపడి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉద్యోగం నుంచి తొలగించిన ఎండీ దీపక్‌పై కక్ష పెంచుకుని జూలై 4 అర్ధరాత్రి పటాన్‌చెరువు నుంచి మారుతి రిట్జ్ కారులో అచ్చంపేట్ చేరుకున్నారు.
కాటేజీలో ఎవరూ లేని సమయంలో స్టోర్‌రూమ్ తాళం రాయితో పగులగొట్టి రెండు కట్టర్లు, రెండు వెల్డింగ్ మిషన్లు, ఒక వుకో క్లిప్పర్ బాక్స్ సహా సుమారు రూ.1.75 లక్షల విలువైన సామగ్రిని కారులో తీసుకెళ్లారు.
సూపర్‌వైజర్ అందె మహేష్ ఫిర్యాదు మేరకు నిజాంసాగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. బాన్సువాడ డీఎస్పీ విఠల్‌రెడ్డి ఆదేశాల మేరకు బాన్సువాడ రూరల్ సీఐ తిరుపయ్య ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టగా, సాంకేతిక ఆధారాల సహాయంతో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించారు. వారు నేరాన్ని అంగీకరించడంతో దొంగిలించిన రెండు కట్టర్లు, రెండు వెల్డింగ్ మిషన్లు, ఒక వుకో క్లిప్పర్ బాక్స్, మారుతి రిట్జ్ కారు, రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్‌కు తరలించారు.అత్యంత వేగంగా కేసును ఛేదించి దొంగిలించిన వస్తువులను స్వాధీనం చేసుకున్న బాన్సువాడ రూరల్ సీఐ ఎ. తిరుపయ్య, నిజాంసాగర్ ఎస్‌ఐ జె. శివకుమార్‌తో పాటు పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర అభినందించారు.