తిరుపతి జూన్ 24.
తిరుపతి జిల్లా, ఏర్పేడు మండలం పరిధిలోని అంజిమేడు సమీపంలో ఈ నెల 15న జరిగిన రూ.15 లక్షల నగదు దోపిడీ కేసును జిల్లా పోలీసులు విజయవంతంగా ఛేదించారు. ఫిర్యాదుదారు రవీంద్రరెడ్డిని కత్తితో బెదిరించి నగదు అపహరించిన ఈ ఘటనపై ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు ఆదేశాల మేరకు ఏర్పేడు పోలీసులు ప్రత్యేక దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా బుధవారం నీలాద్రి అపార్ట్మెంట్స్ సమీపంలో తనిఖీలు నిర్వహించి, కర్ణాటక, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు జిల్లాలకు చెందిన ఎనిమిది మంది నిందితులను ( ఏ-2 నుండి ఏ-9) అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుండి రూ.3 లక్షల నగదుతో పాటు నేరానికి ఉపయోగించిన ఇన్నోవా, స్విఫ్ట్ కార్లు కలిపి మొత్తం నాలుగు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఈ కేసులో ప్రధాన నిందితురాలు ఏ-1 లక్ష్మీకాంతమ్మ ప్రస్తుతం పరారీలో ఉండగా, ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కేవలం తొమ్మిది రోజుల్లోనే కేసును ఛేదించిన ఏర్పేడు సీఐ బి. శ్రీకాంత్ రెడ్డి, ఎస్ఐలు, సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ.. పెద్ద మొత్తంలో నగదు తీసుకెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, తాబేళ్లు, మూడు తలల పాములు, గుప్తనిధుల పేరుతో మోసగించే మూఢనమ్మకాలను నమ్మవద్దని సూచించారు. ఏదైనా అత్యవసరమైతే వెంటనే డయల్-112 లేదా సైబర్ ఫిర్యాదుల కోసం 1930 నంబర్లను సంప్రదించాలని కోరారు.
