ద్ర్లై
అర్హులైన టీటీడీ ఉద్యోగులకు కూడా పాత పెన్షన్ అమలు చేయాలి..
తిరుపతి జూన్ 24.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమం కోసం తీసుకుంటున్న నిర్ణయాలు అభినందనీయమని ఆంధ్రప్రదేశ్ సీపీఎస్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు చీర్ల కిరణ్ పేర్కొన్నారు. ప్రభుత్వం విడుదల చేసిన మెమో నెం.57 ద్వారా అర్హులైన ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం (ఒపీస్ ) వర్తింపజేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ఆయన హర్షం వ్యక్తం చేస్తూ స్వాగతించారు. ఉద్యోగుల పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చూపుతున్న మానవతా దృక్పథానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సీపీఎస్ అమలుకు ముందు నియామక ప్రక్రియ పూర్తయి, పరిపాలనా కారణాల వల్ల ఆలస్యంగా విధుల్లో చేరిన ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం వర్తింపజేయడం చారిత్రాత్మక నిర్ణయమని అన్నారు. అదే విధంగా తిరుమల తిరుపతి దేవస్థానాలు (టీటీడీ)లో కూడా మేనేజ్‌మెంట్ పరమైన ఆలస్యాల కారణంగా 2004లో ఉద్యోగాలు పొందాల్సిన అనేక మంది అభ్యర్థులకు 2005లో నియామకాలు లభించాయని, దీంతో వారు పాత పెన్షన్ విధానానికి అర్హులైనా కొత్త పెన్షన్ విధానం (సిపిస్ ) పరిధిలోకి వెళ్లాల్సి వచ్చిందని తెలిపారు. మెమో-57 స్ఫూర్తిని కొనసాగిస్తూ, టీటీడీలో మేనేజ్‌మెంట్ ఆలస్యం వల్ల అన్యాయానికి గురైన అర్హులైన ఉద్యోగుల పరిస్థితిని కూడా ప్రభుత్వం మరియు టీటీడీ సానుకూలంగా పరిశీలించి, వారికి సైతం పాత పెన్షన్ విధానం అమలు చేయాలని చీర్ల కిరణ్ కోరారు. రాష్ట్రంలో ఇంకా సిపిస్ పరిధిలో ఉన్న ఉద్యోగుల సమస్యలను కూడా ప్రభుత్వం దశలవారీగా పరిష్కరించి, ఉద్యోగుల భవిష్యత్ భద్రతకు మరిన్ని చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

