తిరుపతి జూన్ 25. శేషాచలం అడవుల నుండి ఇతర రాష్ట్రాలకు జరుగుతున్న ఎర్రచందనం అక్రమ రవాణాపై అక్రమ రవాణా నిరోధక దళం (ఆర్‌ఎస్‌ఏఎస్‌టీఎఫ్) పెద్ద దెబ్బకొట్టింది. నమ్మదగిన సమాచారంతో అనంతపురం జిల్లా, నార్పల మండలం, బొందలవాడ గ్రామ శివార్లలోని ఒక పొలంలో దాచిన భారీ ఎర్రచందనం డంప్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ముగ్గురు నిందితుల అరెస్ట్ – రూ. 2 కోట్ల దుంగలు సీజ్:
ఈ దాడుల్లో అనంతపురం జిల్లాకు చెందిన నల్లాని నందకుమార్, నల్లాని జయరామయ్య, బొట్టు రాఘవేంద్ర అనే ముగ్గురు స్మగ్లర్లను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి రూ. 2 కోట్ల విలువైన 109 ఎర్రచందనం దుంగలతో పాటు రవాణాకు సిద్ధంగా ఉంచిన ఒక కారును సీజ్ చేశారు. నిందితులు కూలీల ద్వారా శేషాచలం అడవుల్లో చెట్లను నరికించి, దిల్లీ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోని ప్రధాన స్మగ్లింగ్ ముఠాలకు ఎక్కువ ధరకు విక్రయించేందుకు ఈ డంప్ ఏర్పాటు చేసినట్లు విచారణలో తేలింది.
అధికారుల పర్యవేక్షణ – ప్రశంసలు:
ఆంధ్రప్రదేశ్ల్ రాష్ట్ర శేషాచలం రిజర్వ్ అటవీ ప్రాంతం లో జరుగుతున్న ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టే లక్ష్యంతో ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక దళం హెడ్ ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు, ఐపీఎస్ ,ఎస్పీ పి . శ్రీనివాస్, అదనపు అధికారి జె. కులశేఖర్ ల మార్గదర్శకత్వంలో టాస్క్ ఫోర్స్ బృందం మరియు అటవీ సిబ్బంది అత్యంత సమర్థవంతంగా నిర్వహించి నిందితులను పట్టుకున్నారు. అక్రమ రవాణాను అడ్డుకోవడంలో ప్రతిభ కనబరిచిన సిబ్బందిని ఉన్నతాధికారులు ప్రత్యేకంగా అభినందించి, బహుమతులు ప్రకటించారు. పరారీలో ఉన్న మిగిలిన సూత్రధారుల కోసం ప్రత్యేక బృందాలతో దర్యాప్తు ముమ్మరం చేశారు.

