- మృతుల కుటుంబాలకు కోటి రూపాయలు ఎస్గ్రేషన్ ఇవ్వాల్సిందే.
- మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పష్టీకరణ.
- తప్పుల్ని ప్రశ్నిస్తే లోకేష్ కు ఫ్రస్ట్రేషన్ ఎందుకు ?
- పరామర్శకు వచ్చి ఎందుకంత అసహనం ?
- .సూటిగా ప్రశ్నించిన గుడివాడ అమర్నాథ్.
- రెండేళ్లలో 6వేల మంది కాంట్రాక్టు కార్మికుల తొలగింపు
- 1800 మంది రెగ్యులర్ ఉద్యోగుల్నీ తీసేశారు?
- ఎక్కడా లేని విధంగా ఉత్పత్తి ఆధారిత జీతాలు గుర్తుచేసిన అమర్నాథ్!
- స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకుంది జగనే
- బాధితుల కుటుంబాలను పరామర్శకు రానున్న జగన్

మన దేశ ప్రతినిధి విశాఖపట్నం జూన్ 9 :దేశాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసిన విశాఖ స్టీల్ ప్లాంట్ ఘటనలో మరణాలు ముమ్మాటికీ కూటమి సర్కార్ చేసిన హత్యలే అని, వీటిపై ప్రశ్నిస్తే మంత్రి లోకేష్ తీవ్ర అసహనానికి గురై కార్మిక సంఘాలపై నోరు పారేసుకుంటున్నారని.వైఎస్సార్సీపీ నేత,మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు.విశాఖ స్టీల్ ప్లాంట్ ఘటనకు కారణాల్ని వెతకాల్సిన ప్రభుత్వ పెద్దలు, నిస్సిగ్గుగా వైఎస్సార్సీపీపై విమర్శలకు దిగడం దారుణమని విశాఖలో మీడియాతో మాట్లాడుతూ గుడివాడ అమర్నాథ్ ఆక్షేపించారు.స్టీల్ ప్లాంట్ లో ప్రమాదానికి బాధ్యత వహిస్తూ మృతుల కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రెస్ మీట్లో గుడివాడ అమర్నాథ్ ఇంకా ఏమన్నారంటే నియంతలా లోకేష్ వ్యవహారశైలినిన్న విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరిగిన ఘటన రాష్ట్ర ప్రజలతో పాటు దేశవ్యాప్తంగా అందరినీ ఆశ్చర్యపరిచింది.ప్రస్తుత టెక్నాలజీ యుగంలో,భారీ భద్రతా ప్రమాణాలు అందుబాటులో ఉన్న కాలంలో ఇంత మంది ప్రాణాలు కోల్పోవడం ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మా వంతుగా మృతులు,బాధితుల కుటుంబ సభ్యుల్ని కలిసి ఓదార్చే ప్రయత్నం చేశాం.కనీసం మృతదేహాల్ని గుర్తుపట్టలేని పరిస్ధితులు ఉన్నాయి.మృతుల కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం ఇవ్వడంతో పాటు వారి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని కోరాం.క్షతగాత్రులకు 50 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని అడిగాం.కానీ ఇవాళ ముఖ్యమంత్రి కుమారుడు లోకేష్ స్టీల్ ప్లాంట్ బాధితుల పరామర్శకు వచ్చారు.ఆయన మాట్లాడిన తీరు చూసి ఈ ప్రాంతంలో ప్రజలు ముక్కున వేలేసుకున్నారు.ఆయన దేనికి వచ్చారు,రాజకీయాలు మాట్లాడటానికే వచ్చారా లేక బాధితుల్ని పరామర్శించేందుకు వచ్చారా అనేది తెలియడం లేదు.కేజీహెచ్ లో కార్మిక సంఘాల నాయకులతోనూ అదే తీరున మాట్లాడారు.అందులో ఆయన ఫ్రస్ట్రేషన్ అంతా కనిపించింది.ఆయన చేతకానితనం బయటపడటంతోనే ఫ్రస్ట్రేషన్ పుట్టుకొచ్చినట్లు అర్దమవుతుంది.ఆయన ఓ నియంతలా మాట్లాడారు.ఓ వ్యవస్ధలో,సంస్ధలో పనిచేసే తోటి వారికి ఏదైనా జరిగితే కుటుంబ సభ్యులతో సమానంగానే భావిస్తాం.మీ ఇంట్లో ఎవరైనా పోయారా అని లోకేష్ అడగడం దారుణం.కార్మిక సంఘాలపై రెచ్చగొట్టే మాటలేంటి ?బాధితుల తరఫున కార్మిక సంఘాలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మీ సమాధానం ఇంత రెచ్చగొట్టేలా ఉండాలా ? ఓదార్చాల్సిన సమయంలో రెచ్చగొట్టే మాటలు మాట్లాడారు.కార్మిక సంఘాల్లో సీనియర్ నాయకుల్ని సైతం చులకనగా మాట్లాడారు.కార్మిక సంఘాల్లోకి వచ్చే సమయానికి లోకేష్ పుట్టి కూడా ఉండడు.అధికారం ఉంది కదా అని వారిపై రెచ్చిపోయే మాట్లాడతారా? విశాఖ ఉక్కు చరిత్రలో లోకేష్ వ్యాఖ్యలు,ఈ ప్రభుత్వం వ్యవహరించిన తీరు మాత్రం చెరిగిపోదు.దీన్ని అందరూ ఖండించాల్సిన అవసరం ఉంది.ఉత్తరాంధ్ర ప్రాంతంలో మీలా అందరికీ అక్రమ సంపాదన ఉండకపోవచ్చు కానీ ఇక్కడి కార్మిక నేతలకు ఆత్మగౌరవం మాత్రం ఉంటుంది.మీ తప్పిదాల వల్ల గత మాసాలుగా స్టీల్ ప్లాంట్ నిర్వీర్యం చేసే క్రమంలో జరిగిన ప్రమాదం ఇది. ఇవి ముమ్మాటికీ ఈ కూటమి ప్రభుత్వం హత్యలే.2024లో కూటమి అధికారంలోకి వచ్చాక ఎప్పటి నుంచో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల్ని బలవంతంగా బయటికి పంపారు.ఉద్యోగుల్ని సైతం మెగా వీఆర్ఎస్ పేరుతో ఒత్తిడి తెచ్చి బయటికి పంపారు. ఈ రెండేళ్లలో 6 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగుల్ని బయటికి పంపారు.1800 మంది రెగ్యులర్ ఉద్యోగుల్ని వీఆర్ఎస్ పేరుతో బలవంతపు రిటైర్మెంట్ ఇప్పించారు. 30 వేలు ఉన్న కాంట్రాక్టు ఉద్యోగులు 15-16 వేలకు తగ్గిపోయారు. అంటే వారిపై పని ఒత్తిడి రెట్టింపైంది. దేశంలో ఎక్కడా లేని పద్దతుల్ని స్టీల్ ప్లాంట్ లో అమలు చేస్తున్నారు. ఉత్పత్తి ఆధారంగా జీతాలు ఇవ్వడం చేస్తున్నారు. దేశంలో ఏ ప్రభుత్వ రంగ సంస్ధలో ఈ విధానం ఉందో చెప్పాలి.ప్రభుత్వ రంగ సంస్థల్లో ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగులు ఉంటారు. ఎగ్జిక్యూటివ్ లో బదిలీలు ఉంటాయి. నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగులు మాత్రం ప్లాంట్ లో ఉన్న యంత్రాలతో అనుబంధం ఉంటుంది కాబట్టి బదిలీలు చేయరు. కానీ మొదటిసారి గత మూడు నెలలుగా నాన్-ఎగ్జిక్యూటివ్ ఉద్యోగుల్ని కూడా బదిలీలు చేసేస్తున్నారు. ఈ మార్పులు చేర్పుల వల్ల ప్లాంట్ లో యంత్రాలపై ఉద్యోగులకు అవగాహన తగ్గిపోతుంది.మీ ప్రభుత్వం వచ్చాక చేతకాని తనం వల్ల చేస్తున్న మార్పులివి. హెచ్ఆర్ఏ,వైద్య సాయం వంటి సదుపాయాలు లేకుండా చేస్తున్నారు.ఎల్టీసీ సదుపాయం కూడా తీసేశారు.చివరికి ప్రాణాలకు భద్రత కూడా లేకుండా చేశారు.దానికి సమాధానం చెప్పలేక ఫ్రస్ట్రేషన్ తో కార్మిక సంఘాలపై తిరగబడుతున్నారు. లోకేష్ తీరు ఏమాత్రం సరికాదు.పవన్ వి అవగాహన లేని మాటలుఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు అసలు అవగాహన ఉందా లేదా కూడా తెలియడం లేదు. నిన్న జరిగిన ఘటనకూ గత ప్రభుత్వానికీ,జగన్మోహన్ రెడ్డి గారికీ ఏం సంబంధం ?ఈ రెండేళ్లలో కానీ,గతంలో కానీ ప్రధాని మోడీతో కానీ, కేంద్రంతో కానీ మాట్లాడి ఈ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయొద్దని అడిగారా?తిరిగి ఇప్పుడు కార్మికుల్ని నిందిస్తున్నారు.విశాఖ స్టీల్ ప్లాంట్ మాత్రమే కాదు దేశవ్యాప్తంగా ఉన్న విధానాలు చూడాలని గతంలో పవన్ చెప్పలేదా ? కార్మికులు ముందుకొస్తే పోరాటం చేస్తానని మరోసారి చెప్పారు.జగన్మోహన్ రెడ్డి గారిపై అన్యాయంగా విమర్శలకు దిగుతున్నారు.విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై తొలిసారి ప్రకటన రాగానే.ఐదారు రోజుల వ్యవధిలోనే ప్రధాని మోడీకి జగన్మోహన్ రెడ్డి లేఖ రాశారు.ఈ ప్లాంట్ ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని,దానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయని, ఇది రాష్ట్ర ఆత్మగౌరవానికి సంబంధించిన అంశమని,32 మంది ప్రాణ త్యాగాలతో సాధించుకున్న ప్లాంట్ అని ప్రధానికి గుర్తుచేశారు.పవన్ కళ్యాణ్ ఏదైనా లేఖ రాస్తే చూపించాలి.2022 నవంబర్ 12న విశాఖకు ప్రధాని మోడీ వస్తే అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి వేదికపైనా ప్రైవేటీకరణ చేయొద్దని కోరారు.అదే సంవత్సరం కార్మిక సంఘాలు జగన్మోహన్ రెడ్డిని కలిసి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసి పంపాలని కోరితే అప్పట్లో తీర్మానం చేసి పంపారు.పరిశ్రమల మంత్రిగా గౌతంరెడ్డి ఉన్నారు.నేనూ అసెంబ్లీలో ఉండి స్టీల్ ప్లాంట్ కు వ్యతిరేకంగా ప్రసంగం చేసిన రికార్డులు ఉన్నాయి. అసెంబ్లీ తీర్మానాన్ని కేంద్రానికి పంపించాం. ప్రైవేటీకరణను అడ్డుకుంది జగనే ఉక్కు శాఖ మంత్రిగా కుమారస్వామి బాధ్యతలు చేపట్టాక 2021 జనవరిలో తాము స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు నిర్ణయం తీసుకుంటే, అప్పట్లో ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న ప్రభుత్వం అసెంబ్లీ తీర్మానం ద్వారా దీన్ని వ్యతిరేకించి పంపినట్లు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఒక్క కాంట్రాక్టు కార్మికుడిని అయినా,రెగ్యులర్ ఉద్యోగిని అయినా తీసేశారా,నెలలవారీ జీతం,బోనస్, వైద్య సదుపాయాలు ఆగిన సందర్భాలు ఉన్నాయా అనేది కార్మిక సంఘాల్ని అడిగితే తెలుస్తుంది.ఆ రోజు వైఎస్సార్సీపీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుంది కాబట్టే ఇప్పటికీ అది ముందుకెళ్లకుండా ఆగింది.పవన్ కళ్యాణ్ ఇవాళ జగన్మోహన్ రెడ్డి మీద,వైఎస్సార్సీపీ మీద రాజకీయ ప్రసంగాలు చేస్తున్నారు.లోకేష్ మమల్ని టీమ్ లెవెన్ అంటున్నారు,ఆయన పార్టీ,కూటమి ఎలా గెలిచిందో అందరికీ తెలుసు కాబట్టి టీమ్ ఈవీఎం అనాల్సి ఉంటుంది. బీజేపీతో ప్రత్యక్షంగా,ఈసీతో పరోక్షంగా పొత్తు పెట్టుకోకపోతే మీకు ఇన్ని సీట్లు ఎలా వస్తాయి? లోకేష్ అధికార మదమెక్కి నీచంగా మాట్లాడుతున్నారు.సింహాచలంలో గోడ కూలిపోయి 8 మంది చనిపోతే లోకేష్ కు పెద్ద ఘటన కాదు,స్టీల్ ప్లాంట్ లో 8 మంది చనిపోతే అదీ పెద్ద ఘటన కాదు, తిరుపతిలో తోపులాట జరిగి ఆరుగురు చనిపోయినా మీకు పెద్ద ఘటన కాదు. ఇంకా ఎంత మంది పోతే మీకు ఇదో పెద్ద ఘటన అని అర్దమవుతుంది.14 వేల కోట్లు ఇచ్చి కాపాడామని చెప్పుకుంటున్న ప్రభుత్వం అవి ఇచ్చింది బ్యాంకులకు మాత్రమేనని అందరికీ తెలుసు. ఉద్యోగుల సంక్షేమానికో,ప్లాంట్ కోసమో మీరు రూపాయి ఖర్చుపెట్టలేదు.ఉద్యోగుల్ని తొలగించే వీఆర్ఎస్ కోసం ఆ డబ్బులు ఖర్చుపెట్టారు.బాధాక సందర్భాల్లో అయినా నీచంగా రాజకీయాలు మాట్లాడొద్దని కోరుతున్నాం. ఇప్పటికైనా మీరు చేసిన వ్యాఖ్యలకు కార్మిక సంఘాలకు, మృతుల కుటుంబాలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం.మీ కూటమి ప్రభుత్వం చేసిన హత్యలే.2012లో ప్రమాదం జరిగితేనే 25 లక్షలు ఇచ్చారు. మేం అధికారంలో ఉండగా ఎల్జీ పాలిమర్స్ ఘటనలో కోటి రూపాయలు పరిహారం ఇచ్చాం. కేంద్రమంత్రి 25 లక్షలు ఇస్తామని చెప్పినా,రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రూపాయి కూడా ప్రకటించలేదు. ఎట్టి పరిస్ధితుల్లో మృతుల కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం ప్రకటించాల్సిందే.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ విశాఖకు వస్తున్నారు. నేరుగా ఎయిర్ పోర్టు నుంచి సెవెన్ హిల్స్, కిమ్స్ ఆస్పత్రులకు వెళ్లి బాధితుల్ని పరామర్శించి బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పబోతున్నారని గుడివాడ అమర్నాథ్ తెలిపారు.