అకాల వర్షాలతో కుమ్మర కొండూరులో రైతులకు భారీ నష్టం..!
వీధురు గాలులకు నేలకొరిగిన మామిడి తోటలు.సుమారు 30 టన్నుల మామిడి కాయలు నేలపాలు.ఘటన స్థలానికి చేరుకొని
నష్టపోయిన పంట పొలాలను పరిశీలించిన ఎమ్మెల్యే కాకర్ల.
కలిగిరి మే 4, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె.

కలిగిరి మండలం, కుమ్మరకొండూరు పంచాయితీ పరిధిలో నిన్న అకస్మాత్తుగా వీచిన తీవ్ర గాలులు, ఉరుములు-మెరుపులతో కూడిన అకాల వర్షాలు రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. ఇప్పటికే కోత దశకు చేరుకున్న పంట పొలాల్లోని మామిడి తోటలు ఈ ప్రకృతి విపత్తుకు బలైపోయాయి. బలమైన గాలుల ధాటికి అనేక మామిడి చెట్లు నేలకొరిగి, సుమారు 30 టన్నుల మేర పండ్ల దిగుబడి పూర్తిగా నేలపాలు కావడం రైతులను తీవ్ర నిరాశకు గురిచేసింది. సంవత్సరమంతా కష్టపడి సాగు చేసిన పంట ఒక్కసారిగా నాశనం కావడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ దుర్ఘటన విషయం తెలిసిన వెంటనే ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని నష్టపోయిన పంట పొలాలను స్వయంగా పరిశీలించారు. బాధిత రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుని వారికి ధైర్యం చెప్పారు. అనంతరం సంబంధిత వ్యవసాయ, రెవెన్యూ శాఖ అధికారులతో సమావేశమై నష్టాన్ని సమగ్రంగా అంచనా వేయాలని ఆదేశించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆదుకుంటుందని, వారికి తగిన పరిహారం అందేలా తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రైతులు నిరాశ చెందవద్దని, ప్రభుత్వం వారి వెంటే నిలుస్తుందని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నెల్లూరు జిల్లా పార్లమెంటు ఉపాధ్యక్షులు బిజ్జం వెంకటకృష్ణారెడ్డి, కలిగిరి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పూసల వెంగప నాయుడు, మండల తెలుగుదేశం పార్టీ నాయకులు స్థానిక గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
