మన ధ్యాస, నెల్లూరు,జనవరి 10 :సంక్రాంతి రాకతో ముందస్తు సంబరాలు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాల్లో జరుగుతున్నాయి. కానీ నెల్లూరు సిటీలో మాత్రం ఈ వినోదం రెట్టింపు ఆనందాన్నిచ్చింది. పట్టణానికి పల్లె వాతావరణాన్ని తీసుకొచ్చింది. నోరూరించేలా పిండివంటల రుచులను ఆహుతులంతా ఆస్వాదించారు. మంత్రి పొంగూరు నారాయణ సతీమణి రమాదేవి ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలోని నారాయణ మెడికల్ కాలేజీ గ్రౌండ్స్ లో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటేలా సాగాయి. వెయ్యిమందికి పైగా మహిళలు ఈ సంబరాల్లో పాల్గొని ఆటపాటలతో అలరించారు. ముగ్గుల పోటీలు, ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలతో సంక్రాంతికి బోలెడంత వినోదపు విందు వడ్డించారు. సంక్రాంతి సంబరాల్లో ముందుగా భోగిపండగ కార్యక్రమ విశిష్టత తెలుపుతూ భోగిమంటలు వేశారు. చిన్నారులపై నారాయణ సతీమణి రమాదేవి భోగిపండ్లు పోసి ఆశీర్వదించారు. సంక్రాంతి విశిష్టతను చాటేలా రంగవల్లులు అలంకరించారు. రమాదేవి స్వయంగా కట్టెల పొయ్యిపై పొంగలి వండారు. అనంతరం ఆటపాటలతో సాగిన వినోదాల హరివిల్లు అందర్నీ ఆకట్టుకుంది. పండగ సంస్కృతి సంబరాలను తెలిపేలా క్రీడా మైదానాన్ని సిద్ధం చేశారు. డూడూ బసవన్నలు, హరిదాసులు, పల్లె పడుచుల్లా సిద్ధమైన మహిళామణులు, పల్లెటూరి సంప్రదాయ దుస్తుల్లో వచ్చిన పిల్లలు, పెద్దలు ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణ. కూటమి పార్టీల నేతలు, నెల్లూరు సిటీకి చెందిన మహిళలు ఈ కార్యక్రమానికి పెద్దసంఖ్యలో హాజరయ్యారు. దాదాపు వెయ్యిమందికి పైగా ఈ సంక్రాంతి సంబరాల్లో పాల్గొనడం విశేషం. అందరికీ ఇక్కడే భోజనం ఏర్పాట్లు చేశారు. మహిళలకు ముగ్గుల పోటీలు, టగ్ ఆఫ్ వార్, రన్నింగ్ రేస్, షాట్ పుట్, త్రోబాల్, మ్యూజికల్ చైర్స్ పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతులు అందించారు. బెలూన్ బ్లాస్టింగ్ ఆద్యంతం అందర్నీ ఆకట్టుకుంది. సంప్రదాయ నృత్యరీతులు అందర్నీ అలరించాయి. సెల్ఫీ పాయింట్ వద్ద ఫొటోలు దిగేందుకు మహిళలు పోటీ పడ్డారు. నెల్లూరు సిటీలో ఏ పండగ అయినా నియోజకవర్గం అంతా పండగ వాతావరణం కనపడుతుంది. ముఖ్యంగా సిటీ ఎమ్మెల్యే, మంత్రి నారాయణ ఆధ్వర్యంలో పండగ కార్యక్రమాలు ప్రజలందరిలో జోష్ నింపుతాయి. రంజాన్ పండగ సందర్భంగా ముస్లింలకు రంజాన్ తోఫా అందిస్తుంది నారాయణ కుటుంబం. ఇటీవల క్రిస్మస్ వేడుకలను గోమతీ నగర్ లోని క్యాంప్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. క్రైస్తవ సోదరులందరికీ క్రిస్మస్ కానుకలు అందించారు. తాజాగా సంక్రాంతి పండగ సందర్భంగా నారాయణ మెడికల్ కాలేజీ గ్రౌండ్ ఒక చిన్న గ్రామాన్నే తలపించింది. తెలుగు సంస్కృతులను ప్రజలందరికీ గుర్తు చేస్తూ ప్రజలతో పండగలు జరుపుకోవడం తమకెంతో ఆనందంగా ఉందని తెలిపారు రమాదేవి. తన భర్త నారాయణకు భారీ మెజార్టీ అందించిన నెల్లూరు సిటీ ప్రజలతో ఈ పండగ జరుపుకోవడం మరింత సంతోషం అని, టీడీపీ కార్యకర్తలకు నిత్యం అందుబాటులో ఉంటూ, వారి యోగక్షేమాలు తెలుసుకుంటామని, వారంతా తమ కుటుంబ సభ్యులేనని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ తాళ్ళపాక అనూరాధ ,మాజీ జెడ్పీటీసీ విజేతా రెడ్డి , నెల్లూరు సిటీ టీడీపీ మహిళా నేతలు, కార్యకర్తలు, నారాయణ విద్యాసంస్థల సిబ్బంది, పొంగూరు అభిమానులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *