– మన న్యూస్ , కోవూరు : ఆధికారులు, రైతులతో సమన్వయం చేసుకొని అన్నదాతలకు అండగా వుండండి. – సేవాభావం వున్న వారినే సహకార సంఘాల పాలక వర్గాలలో నియమించాం. – వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి రైతుల జీవితాలలో వెలుగులు నింపాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యం. – రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన టిడిపి కార్యకర్తకు పార్టీ తరుపున 5 లక్షల చెక్కు పంపిణి – ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.గత ప్రభుత్వం విస్మరించిన రైతు బంధు పధకాన్ని పునరుద్ధరించి నామ మాత్ర వడ్డీతో అన్నదాతలకు రుణ సౌకర్యం కల్పిస్తామన్నారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి . కోవూరు మండలం పడుగుపాడు పి. ఎ. సి .ఎస్ కార్యాలయ ఆవరణలో జరిగిన ముదివర్తి, పడుగుపాడు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పాలక వర్గాల ప్రమాణ స్వీకారంలో ముఖ్యఅతిథిగా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికు రైతులు ఘన స్వాగతం పలికారు. కో ఆపరేటివ్ అధికారుల సమక్షంలో పడుగుపాడు సొసైటి ఛైర్మెన్ గా నాగారెడ్డి శ్యాం సుందర్ రెడ్డి, డైరెక్టర్లుగా నర్రా శ్రీనివాసరావు, నాగిరెడ్డి జయశంకర్ ముదివర్తి సొసైటి ఛైర్మెన్ గా తన్నీరు రాజయ్య, డైరెక్టర్లుగా బాడుగ మస్తానయ్య, వరికొండ సుబారావుచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ……. రైతుల అవసరాలను దృష్టిలో వుంచుకొని అన్నదాత సుఖీభవ పధకం ద్వారా ఆర్ధిక చేయూతనిచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతు పక్షపాతి అని కొనియాడారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి రైతుల జీవితాలలో వెలుగులు నింపేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారన్నారు. గత రబీ సీజన్ లో ధాన్య సేకరణ చేసిన 24 గంటలలోనే రైతుల ఖాతాలలో డబ్బులు జమ చేసినట్టుగా ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో కూడా రైతుల నుంచి ధాన్య సేకరణ చేయాలని మంత్రిని కోరినట్లు ఆమె తెలిపారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జమ్మిపాలెం గ్రామానికి టిడిపి కార్యకర్త మల్లపాటి సుధీర్ కుటుంబ సభ్యులకు పార్టీ తరుపున 5 లక్షల రూపాయల చెక్కును అందచేశారు. బాధిత కుటుంబానికి విపిఆర్ ఫౌండేషన్ అండగా వుంటుందన్నారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి . ముదివర్తి, పడుగుపాడు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఛైర్మెన్లు మరియు డైరెక్టర్లుగా సేవాభావం కలిగిన వ్యక్తులను నియమించామన్నారు. అధికారుల, రైతులు మరియు గతంలో సహకార సంఘ ఛైర్మెన్లుగా పని చేసిన అనుభవజ్ఞుల సలహాలు తీసుకొని రైతులకు అండగా వుండాలని కొత్తగా బాధ్యతలు చేపట్టిన సహకార సంఘ పాలక వర్గాలను కోరారు. విత్తనాలు, ఎరువుల సరఫరాతో పాటు వ్యవసాయ ఉత్పత్తులను మార్కెటింగ్ చేసి అన్నదాతల ఆదుకునే బాధ్యత సహకార సంఘాల పై వుందన్న విషయాన్ని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆధునిక వ్యవసాయ విధానాలపై రైతులకు అవగాహన కల్పించి వ్యవసాయ రంగానికి పూర్వ వైభవం తెచ్చేందుకు కృషి చేయాలని ఆకాంక్షించారు. పడుగుపాడు సొసైటీ అభివృద్ధికి కృషి చేసిన పెన్నాడెల్టా ఛైర్మన్ జెట్టి రాజగోపాలరెడ్డి ని ఆమె ప్రశంసించారు.ఇటీవల “పడుగుపాడు అగ్రికల్చర్ కో ఆపరేటివ్ సొసైటి” ఆధ్వర్యంలో హెచ్ పిసిఎల్ భాగస్వామ్యంతో ఇనుమడుగులో పెట్రోల్ బంకు ఏర్పాటు చేసి సహకార సంఘాలకే ఆదర్శంగా నిలిచిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. ప్రగతి పధంలో దూసుకుపోతున్న పడుగుపాడు సొసైటీ మరింత అభివృద్ధి చేసి రాష్ట స్థాయి గుర్తింపు తీసుకొని రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో పెన్నాడెల్టా ఛైర్మన్ జెట్టి రాజగోపాల్ రెడ్డి, కోవూరు తహసీల్దారు సుబ్బయ్య, టిడిపి జిల్లా కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్రెడ్డి, టిడిపి మండల కార్యదర్శి కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి, జొన్నవాడ ఆలయ ఛైర్మన్ తిరుమూరు అశోక్ రెడ్డి, టిడిపి సీనియర్ నాయకులు ఇంతా మల్లారెడ్డి, జిల్లా కో అగ్రికల్చర్ ఆపరేటివ్ సొసైటి అధికారులు పాల్గొన్నారు.




