

మన న్యూస్, నెల్లూరు,మే 24:మున్సిపల్ అనుమతుల కోసం అధికారులు, నాయకులు చుట్టూ తిరిగే పరిస్థితుల నుండి నేరుగా దరఖాస్తుదారుని ఇంటి వద్ద అనుమతులు మంజూరు చేసే విధానాన్ని తీసుకువస్తున్నట్లుగా రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు.శనివారం నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో పెండింగ్ లో ఉన్న టౌన్ ప్లానింగ్ అనుమతులపై టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ విద్యుల్లత తదితరులతో కలసి మంత్రి నారాయణ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ….. ప్రజలకు ఇబ్బంది కలగని రీతిలో పురపాలక శాఖలో అనేక సంస్కరణలు తీసుకొస్తున్నామన్నారు. లే అవుట్ అనుమతులు, బిల్డింగ్ అనుమతులు తదితర మున్సిపల్ అనుమతుల కోసం ప్రజలను ఇబ్బంది పెట్టకుండా చేయడమే ప్రభుత్వ ఉద్యోగుల బాధ్యతయని అన్నారు. గతంలో అనుమతుల కోసం ఆన్లైన్ విధానాన్ని తీసుకొచ్చిన ఘనత తమదేనన్నారు. అవసరమైన అన్ని డాక్యుమెంట్స్ అందించిన దరఖాస్తుదారులకు 72 గంటల్లో అనుమతులు మంజూరు చేయాలన్నారు. అవసరమైన పత్రాలు సమర్పించని దరఖాస్తుదారులకు ప్రత్యేక కమిటీలు నేరుగా వారి ఇళ్ల వద్దకే వెళ్లి పరిశీలించి అక్కడికక్కడే అనుమతులు మంజూరు చేసే విధానాన్ని తీసుకువస్తామన్నారు. ఇందుకోసం నెల్లూరు నుండే ప్రారంభించి రాష్ట్రoలోని ఇతర మున్సిపాలిటీలకు విస్తరిస్తామన్నారు. గత సంవత్సరకాలంగా పురపాలక శాఖలో అనేక సంస్కరణలను తీసుకువచ్చి పలు నిబంధనలను సడలించామని, అవసరమైతే మరిన్ని సంస్కరణలను తెస్తామన్నారు. మున్సిపల్ అనుమతుల కోసం అధికారులు, నాయకులు చుట్టూ తిరిగాలనే అపోహలను పోగొట్టాలని కోరారు. నెల్లూరు నగర పాలక సంస్థలో అనుమతుల గురించి వివరిస్తూ టౌన్ ప్లానింగ్ లో అందిన దరఖాస్తుల్లో 25 శాతం మందికి 3 రోజుల్లోను, 67 శాతం మందికి 10 రోజుల్లోను అనుమతులు మంజూరు చేశామన్నారు. మిగిలిన వాటిలో సరైన పత్రాలు అందించిన తదుపరి మంజూరు చేస్తామని వివరించారు. రాష్ట్ర టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ ఇతర అధికారులు స్వయంగా ఆయా దరఖాస్తులను పరిశీలించి త్వరితగతిన అనుమతులు మంజూరు చేయటం అభినందనీయమన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర టౌన్ ప్లానింగ్ అడిషనల్ డైరెక్టర్లు వరప్రసాద్, శ్రీనివాసులు, మున్సిపల్ కమిషనర్ నందన్, చీఫ్ సిటీ ప్లానర్ హిమబిందు, తదితరులు పాల్గొన్నారు.

