

జనసేన పార్టీ నాయి బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆవులపాటి బుజ్జిబాబు పిలుపు.
మనన్యూస్,తిరుపతి:ఈనెల 14వ తేదీ పిఠాపురం లో జరగబోయే జనసేన పార్టీ ఆవిర్భావ సభకు చిత్తూరు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న నాయి బ్రాహ్మణ సోదరులందరూ భారీగా తరలిరావాలని జనసేన పార్టీ నాయి బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆవులపాటి బుజ్జిబాబు, జనసేన పార్టీ తిరుపతి నాయి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు సుధాకర్ పిలుపునిచ్చారు. మంగళవారం తిరుపతి నగరంలో ఆవిర్భావ సభకు సంఘీభావం తెలుపుతూ సుమారు 400 మంది వాయిద్య కళాకారులు తమ వాయిద్యాలతో పెద్ద ఎత్తున సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు ఆవులపాటి బుజ్జిబాబు మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ఈనెల 14వ తేదీ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారని చెప్పారు. కూటమి ప్రభుత్వంలోనే నాయి బ్రాహ్మణులకు న్యాయం జరుగుతుందని, ఇప్పటికే నాయి బ్రాహ్మణులకు సబ్సిడీ విద్యుత్ తో పాటు, బీసీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రుణాలు ఇచ్చేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చిందని పేర్కొన్నారు. ఈ పథకాల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా లక్షలాదిమంది నాయి బ్రాహ్మణులు లబ్ధి చేకూరే అవకాశం ఉందన్నారు. ఆవిర్భావ సభకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వందమంది డోలు వాయిద్యాలతో పాటు మరో వంద మంది నాసరాలతో సంఘీభావంగా బయలుదేరి వెళ్లనున్నట్లు ఆయన పేర్కొన్నారు. కావున ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న నాయి బ్రాహ్మణులు ఆవిర్భావ సభకు వచ్చేవారు ముందస్తుగా తమకు తెలియజేయాలని ఆవులపాటి బుజ్జిబాబు సిబ్యాల సుధాకర్ లు పిలుపునిచ్చారు. ఈ సంఘీభావ కార్యక్రమంలో తిరుపతి నగరానికి చెందిన వాయిద్య కళాకారులు నాయి బ్రాహ్మణులు పాల్గొన్నారు.
