

మన న్యూస్,గొల్లప్రోలు:పట్టణ పరిధిలో విచ్చలవిడిగా దోమలు పెరిగిపోయిన అధికారులు చర్యలు తీసుకోవడం లేదని పలువురు సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.గొల్లప్రోలు నగర పంచాయతీ బడ్జెట్ సమావేశం శుక్రవారం చైర్ పర్సన్ గండ్రేటి మంగతాయారు అధ్యక్షతన నిర్వహించారు.ఈ సమావేశంలో పదో వార్డు కౌన్సిలర్ మొగలి దొరబాబు తో పాటు పలువురు సభ్యులు మాట్లాడుతూ దోమలు పెరిగిపోవడం వల్ల పలువురు అనారోగ్యం బారిన పడుతున్నారన్నారు.గతంలో దోమలను శానిటేషన్ చర్యలు చేపట్టి గుడ్డు దశలోనే నివారించే వారని కానీ చాలా కాలం నుండి దోమల నివారణ చర్యలు చేపట్టడం లేదన్నారు.ఇప్పటికైనా దోమల నివారణకు చర్యలు చేపట్టకపోతే ప్రజలు మరిన్ని ఇబ్బందులకు గురయ్యే ప్రమాదముందన్నారు. 3వ వార్డు కౌన్సిలర్ మైనం భవాని మాట్లాడుతూ డ్రైన్ లలో పూడిక సకాలంలో తీయకపోవడం వల్లే దోమలు విపరీతంగా పెరిగి పోయాయన్నారు. కమిషనర్ కనకారావు స్పందిస్తూ త్వరలోనే పాగింగ్ యంత్రాలు తెప్పించి పట్టణంలో మందు స్ప్రే చేయిస్తామన్నారు. దోమల నివారణకు అన్ని విధాలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.అనంతరం టిడిపి కౌన్సిలర్ గుళ్ల సుబ్బారావు, వైసీపీ కౌన్సిలర్ దాసం దేవిలు మాట్లాడుతూ కొన్ని ప్రాంతాల్లో వీధిలైట్లు కొత్తవి ఏర్పాటు చేసినా వెలగడం లేదని ఫిర్యాదు చేసిన ఎవరూ స్పందించడం లేదన్నారు.జగన్ కాలనీలో కుళాయి గొట్టాలు విరిగిపోవడం వల్ల నీరు వృధాగా పోయి రోడ్లు బురదమయం అవుతున్నాయన్నారు. దీనిపై కమీ షనర్ వివరణ ఇస్తూ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందువల్ల వీధిలైట్లు,కుళాయిలు కొత్తవి ఏర్పాటు చేయడానికి అవకాశం లేదని పాతవి మరమ్మతులు చేస్తామని తెలిపారు.కాగా ఎమ్మెల్సీ కోడ్ అమల్లో ఉన్నందువల్ల సాధారణ సమావేశానికి సంబంధించిన అజెండాలోని అంశాలను ప్రవేశ పెట్టలేదు.కాగా 2015 -16 సంవత్సరపు బడ్జెట్ ను సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు.ఈ సమావేశంలో వైస్ చైర్ పర్సన్ గంధం నాగేశ్వరరావు,కౌన్సిలర్లు గండ్రేటి శ్రీరామచంద్రమూర్తి,కూరాకుల శేఖర్,సింగం నాగేశ్వరరావు,గొల్లపల్లి అచ్చమాంబ,కో ఆప్షన్ సభ్యులు మొగలి జయబాబు,ఈరుగుల యేసు తదితరులు పాల్గొన్నారు.