గురుకుల్ లూథరన్ థియోలాజికల్ కాలేజీ ఆధ్వర్యంలో ఘనంగా సదస్సు
సంఘ చరిత్ర, సమకాలీన సవాళ్లపై ప్రిన్సిపాల్ డాక్టర్ దాయం జోసెఫ్ ప్రభాకర్ దిశానిర్దేశం
బిషప్ రైట్ రెవ. డాక్టర్ విజయ భాస్కర్, ట్రెజరర్ డాక్టర్ జయరావులకు పాస్టర్ల కృతజ్ఞతలు
రాజమండ్రి, నవంబర్ 18:
మార్టిన్ లూథర్ రిఫర్మేషన్ (సంస్కరణోద్యమ) వేడుకలను పురస్కరించుకుని రాజమండ్రిలోని ప్రతిష్టాత్మక గురుకుల్ లూథరన్ థియోలాజికల్ కాలేజీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మూడు రోజుల ‘వరల్డ్ లూథరన్ పాస్టర్స్ కాన్ఫరెన్స్’ నేడు (బుధవారం) రెండో రోజు అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగింది. ఆధ్యాత్మిక చైతన్యాన్ని నింపేలా సాగుతున్న ఈ సదస్సులో వివిధ ప్రాంతాలకు చెందిన దైవసేవకులు పెద్ద ఎత్తున భాగస్వాములయ్యారు.
ఈ ప్రత్యేక శిక్షణ మరియు చర్చా సదస్సులో సౌత్ ఆంధ్రా లూథరన్ చర్చి (SALC), ఆంధ్రా ఇవాంజెలికల్ లూథరన్ చర్చి (AELC), మరియు గుడ్ షెపర్డ్ చర్చిల నుండి సుమారు 30 మంది పాస్టర్లు పాల్గొన్నారు. సదస్సులో భాగంగా కాలేజీ ప్రిన్సిపాల్ రెవ. డాక్టర్ దాయం జోసెఫ్ ప్రభాకర్ మరియు సీనియర్ అధ్యాపక బృందం వివిధ అంశాలపై ప్రత్యేక తరగతులు నిర్వహించారు. క్రైస్తవ సంఘ చరిత్ర, మార్టిన్ లూథర్ సంస్కరణల ఆవశ్యకత, నేటి ఆధునిక సమాజంలో సంఘ కాపరులు (పాస్టర్లు) ఎదుర్కొంటున్న వివిధ సవాళ్లు, వాటిని అధిగమించి సమాజ సేవలో ముందుకు సాగే తీరుతెన్నులపై వారు సుదీర్ఘంగా ప్రసంగించి దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా సదస్సుకు హాజరైన SALC పాస్టర్లు మాట్లాడుతూ.. తమ ఆధ్యాత్మిక మరియు పరిపాలనా నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి ఇలాంటి ప్రతిష్టాత్మక సదస్సులో పాల్గొనే అరుదైన అవకాశం కల్పించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఇందుకు సహకరించిన SALC బిషప్ రైట్ రెవ. డాక్టర్ విజయ భాస్కర్ కి, ట్రెజరర్ డాక్టర్ జయరావు కి వారు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. మూడో రోజు ముగింపు వేడుకల్లో మరిన్ని కీలక అంశాలపై చర్చించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.


