పూల వర్షం.. డ్రమ్స్ హోరు.. 52వ డివిజన్లో పండుగలా కూటమి ఎన్నికల ప్రచారం
తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 52వ డివిజన్లో ఎన్డీయే కూటమి బలపరిచిన భాజపా కార్పొరేటర్ అభ్యర్థి గుడిపల్లి పృథ్వీ రెడ్డి కి మద్దతుగా నిర్వహించిన ఎన్నికల ప్రచారం జనసంద్రాన్ని తలపించింది.
ఈ భారీ ప్రచార ర్యాలీలో తుడా ఛైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డా. డాలర్స్ దివాకర్ రెడ్డి , తితిదే పాలకమండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి , జనసేన యువ నాయకుడు ప్రణీత్ , మరియు టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ముఖ్య నాయకులు పాల్గొని ప్రచారాన్ని హోరెత్తించారు.
డివిజన్లో అడుగుపెట్టిన కూటమి నేతలకు స్థానిక ప్రజలు, అభిమానులు, కార్యకర్తలు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు.
డ్రమ్స్ వాయిద్యాల హోరు, యువత కోలాహలం, జై కూటమి నినాదాలతో 52వ డివిజన్ వీధులన్నీ దద్దరిల్లాయి.
నాయకులపై అభిమానులు పూల వర్షం కురిపిస్తూ ఘన స్వాగతం పలికారు.
డివిజన్లోని ప్రతి గడపకూ వెడుతూ, కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ గుడిపల్లి పృథ్వీ రెడ్డి , మేయర్ అభ్యర్థి జేబీ శ్రీనివాస్ ని భారీ మెజారిటీతో గెలిపించాలని నేతలు ఓటర్లను అభ్యర్థించారు.
ఈ సందర్భంగా తుడా ఛైర్మన్ డా. డాలర్స్ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ.. తిరుపతి నగర సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు.
52వ డివిజన్లో ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు,మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు చురుకైన యువ నాయకుడు గుడిపల్లి పృథ్వీ రెడ్డి గెలుపు ఎంతో అవసరమని పేర్కొన్నారు.
ప్రచారంలో ప్రజల నుంచి లభిస్తున్న అపూర్వ స్పందన చూస్తుంటే పృథ్వీ రెడ్డి గెలుపు ఎప్పుడో ఖాయమైందని, ఇక మెజారిటీ లెక్కే మిగిలి ఉందని ధీమా వ్యక్తం చేశారు.
తితిదే బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి మరియు జనసేన నాయకుడు ప్రణీత్ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో తిరుపతిని ఆదర్శ నగరంగా తీర్చిదిద్దుతున్నామని, స్థానికంగా కూటమి అభ్యర్థి గెలిస్తే అభివృద్ధి పనులు మరింత వేగవంతం అవుతాయని తెలిపారు.
టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులన్నీ సమన్వయంతో పనిచేసి గుడిపల్లి పృథ్వీ రెడ్డి కి, మేయర్ అభ్యర్థి జేబీ శ్రీనివాస్ కి అఖండ విజయాన్ని అందించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ పరిధిలోని కూటమి సీనియర్ నాయకులు, మూడు పార్టీల కార్యకర్తలు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


