ఉదయగిరి, అక్టోబర్ 18 (మన ధ్యాస ప్రతినిధి నాగరాజు):

సర్వేంద్రియాణాం నయనం ప్రధానం అన్నారు పెద్దలు. కంటి చూపు ఉంటేనే ప్రపంచాన్ని చూడగలం. అటువంటి కంటి ఆరోగ్యాన్ని కాపాడేందుకు చాగణం లలితమ్మ భాస్కరరావు మెమోరియల్ ట్రస్ట్ చేస్తున్న సేవలు అభినందనీయమని పలువురు ప్రముఖులు కొనియాడారు.పెళ్లకూరు కేంద్రంగా గత కొన్నేళ్లుగా వరుస సేవా కార్యక్రమాలతో ప్రజల మన్ననలు పొందుతున్న చాగణం ట్రస్ట్, తాజాగా ఉదయగిరి మండల ప్రజల కోసం ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించింది. తిరుపతిలోని ప్రఖ్యాత శ్రీ వెంకటేశ్వర అరవింద నేత్రాలయ సహకారంతో ఆదివారం ఉదయగిరిలోని పి.ఎం.శ్రీ గవర్నమెంట్ హై స్కూల్ ప్రాంగణంలో ఈ శిబిరాన్ని ఘనంగా ఏర్పాటు చేశారు.ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం వరకు కొనసాగిన ఈ శిబిరానికి ఉదయగిరి పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. తిరుపతి నుంచి వచ్చిన అనుభవజ్ఞులైన కంటి వైద్య నిపుణుల బృందం అత్యాధునిక పరికరాలతో ప్రతి ఒక్కరికీ క్షుణ్ణంగా కంటి పరీక్షలు నిర్వహించారు. కంటి సమస్యలను గుర్తించి, వయసుతో వచ్చే శుక్లాలు, దృష్టి లోపాలు, ఇతర సమస్యలపై తగిన సలహాలు, సూచనలు అందించారు.శిబిరంలో సేవలు ఇలా,ఈ శిబిరంలో మొత్తం 175 మందికి ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించారు. అందులో 75 మందికి అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు. చూపు మందగించిన 55 మందికి ఉచితంగా కంటి అద్దాలను అందించారు. అత్యంత కీలకంగా కంటి శస్త్రచికిత్సలు అవసరమైన 23 మందిని వైద్యులు గుర్తించారు. వారిని తిరుపతిలోని అరవింద్ నేత్రాలయానికి ఉచితంగా తరలించి, ఉచిత ఆపరేషన్లు నిర్వహించేందుకు ట్రస్ట్ అన్ని ఏర్పాట్లు చేస్తోంది.ప్రతి మండలంలో శిబిరం ఏర్పాటు చేస్తాం – ట్రస్ట్ ప్రతినిధులు
అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ చాగణం గౌరీశంకర్, సీఈవో సీతారామ నాయుడు మాట్లాడారు.”డబ్బులు లేక కంటి వైద్యం చేయించుకోలేని పేదవారికి అండగా ఉండాలన్నదే మా ట్రస్ట్ లక్ష్యం. నెల్లూరు, తిరుపతి జిల్లాల్లోని ప్రతి మండల కేంద్రంలో విడతల వారీగా ఉచిత నేత్ర వైద్య శిబిరాలు నిర్వహిస్తాం. గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేదలకు కార్పొరేట్ స్థాయి కంటి వైద్యాన్ని ఉచితంగా అందించడమే మా సంకల్పం” అని వారు తెలిపారు.కంటి సమస్యలతో బాధపడేవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, తమ ట్రస్ట్ ద్వారా ఉచిత మందులు, కళ్లద్దాలు, ఆపరేషన్లు నిరంతరం కొనసాగుతాయని వారు స్పష్టం చేశారు.ఈ సేవా కార్యక్రమంలో గల్లా కృష్ణ (ఏఓ), చాగణం ట్రస్ట్ ఉద్యోగులు, శ్రీ వెంకటేశ్వర అరవింద్ నేత్రాలయ వైద్య సిబ్బంది, జీవన్, దిలీప్ తదితరులు పాల్గొని శిబిరాన్ని విజయవంతం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *