​మానసిక ఆరోగ్యంపై నిర్లక్ష్యం వద్దు..
​ఆరోగ్యకరమైన మనస్సుతోనే సంతోషకరమైన సమాజం వేణుగోపాలపురంలో అవగాహన సదస్సు..హెల్త్ సూపర్వైజర్ కామరాజు.

​రేణిగుంట అక్టోబర్ 10.

మానసిక ఆరోగ్యం అనేది శారీరక ఆరోగ్యంతో సమానంగా అత్యంత ముఖ్యమైనదని, దానిని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదని హెల్త్ సూపర్వైజర్ కామరాజు పేర్కొన్నారు. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా రేణిగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ చక్రపాణి ఆదేశాల మేరకు తిరుపతి జిల్లా రేణిగుంటలోని వేణుగోపాలపురంలో ప్రజలకు మానసిక ఆరోగ్యంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, ఉద్యోగ ఒత్తిడి, ఒంటరితనం వంటివి మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని తెలిపారు. ఆందోళన, నిరాశ, నిద్రలేమి, అధిక ఒత్తిడి వంటి సమస్యలు ఎదురైనప్పుడు మనసులోనే దాచుకోకుండా కుటుంబ సభ్యులు, స్నేహితులు లేదా నిపుణులతో పంచుకోవాలని సూచించారు. మానసిక సమస్యలతో బాధపడేవారిని చిన్నచూపు చూడకుండా వారి మాటలను ఓపికగా వింటూ, ఆప్యాయతతో ఆదుకోవడం సమాజంలో ప్రతి ఒక్కరి బాధ్యత అని చెప్పారు.
​ప్రతిరోజూ తగినంత నిద్ర, సమతుల్య ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం, యోగా, ధ్యానం వంటి అలవాట్లను అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. మానసిక ఒత్తిడితో బాధపడేవారు కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన ఉచిత టెలి-మానస్ హెల్ప్‌లైన్ నంబర్ 14416 ను సంప్రదించి తగిన సలహాలు, కౌన్సెలింగ్ పొందవచ్చని వివరించారు. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం 2026 ఇతివృత్తమైన “అనుభవాలను వినండి – నిజమైన స్వరాలు, నిజమైన మార్పు” అనే సందేశానికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ మానసిక ఆరోగ్య పరిరక్షణలో భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఒమేగా ఆసుపత్రి వైద్యులు డాక్టర్ ఖలీద్, హెల్త్ సూపర్వైజర్ సరస్వతి, ఏఎన్ఎం రేవతి, ఆశా కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *