తిరుపతి: తిరుపతి కోర్టు ఆవరణలో సెప్టెంబర్ 12 వ తేదీ ఊదయం 10:30 గంటల నుండి సాయంత్రం వరకు జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు మూడవ అదనపు జిల్లా జడ్జి మరియు చైర్మన్ ఎం. గురునాథ్ తెలిపారు. ప్రజలు తమ వివాదాలను త్వరితగతిన, సామరస్యంగా, రూపాయి ఖర్చు లేకుండా పరిష్కరించుకునేందుకు లోక్ అదాలత్ ఒక అద్భుతమైన అవకాశమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం కోసం తిరుపతి కోర్టులో మొత్తం ఐదు ప్రత్యేక బెంచ్ లను ఏర్పాటు చేశారు. మొదటి బెంచ్ లో మూడవ అదనపు జిల్లా జడ్జి ఎం. గురునాథ్ బ్యాంకు, బిఎస్ఎన్ఎల్ మరియు ప్రి లిటిగేషన్ కేసులను విచారిస్తారు. రెండవ బెంచ్ లో నాలుగవ అదనపు జిల్లా జడ్జి జి. అర్చన సివిల్, క్రిమినల్ అప్పీళ్ళు, మోటారు వాహన ప్రమాద కేసులు మరియు చెక్కు బౌన్స్ కేసులను చేపడతారు. మూడవ బెంచ్ లో ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి ఎస్. పి. డి. వెన్నెల సివిల్ మరియు కుటుంబ తగాదాల కేసులను పరిష్కరిస్తారు. నాలుగవ బెంచ్ లో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి జి. లెనిన్ బాబు అలాగే ఐదవ బెంచ్ లో మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి పి. రమాదేవి సివిల్ మరియు రాజీపడదగ్గ క్రిమినల్ కేసులను నిర్వహిస్తారు. ఏళ్ళ తరబడి పెండింగ్ లో ఉన్న కేసులను ఒక్కరోజులోనే పరిష్కరించుకోవచ్చని, దీనివల్ల సమయం మరియు డబ్బు ఆదా అవుతాయని జడ్జి స్పష్టం చేశారు. లోక్ అదాలత్ కు వచ్చే కక్షిదారులు తమ ఆధార్ కార్డు నకలు మరియు పాస్ పోర్ట్ సైజు ఫోటో తప్పనిసరిగా తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి న్యాయవాదులు, రవాణా మరియు పోలీసు అధికారులు, ఇన్స్యూరెన్స్ ప్రతినిధులు, కక్షిదారులు సంపూర్ణంగా సహకరించాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *