సుస్థిరాభివృద్ధి లక్ష్యాల ఇతివృత్తంతో అంతర పాఠశాలల ఇంగ్లీష్ కథల పోటీలు. రేణిగుంట సెప్టెంబర్ 11.

కరకంబాడిలోని అమర రాజా ఆడిటోరియంలో అమర రాజా విద్యాలయం ఆధ్వర్యంలో అంతర పాఠశాలల ఇంగ్లీష్ కథల పోటీ ‘కథోత్సవ్–2026’ (కథాత్సవ – ది ఆర్ట్ అఫ్ స్టోరీటెల్లింగ్ ) గురువారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ‘సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు’ (సుస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ) ప్రధాన ఇతివృత్తంగా నిర్వహించిన ఈ పోటీలలో వివిధ ప్రాంతాలకు చెందిన సుమారు 17 ప్రముఖ పాఠశాలల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ కథా చెప్పే నైపుణ్యంతో ఆకట్టుకున్నారు.

ఈ కార్యక్రమానికి పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఇంగ్లీష్ లాంగ్వేజ్ మరియు లిటరేచర్ ప్రొఫెసర్ డాక్టర్ పి. హరి పద్మ రాణి, అమర రాజా గ్రూప్ చీఫ్ సస్టైనబిలిటీ ఆఫీసర్ ప్రశాంత్ తివారి, అమర రాజా ఎనర్జీ మరియు మొబిలిటీ లిమిటెడ్ సీనియర్ మేనేజర్ బాలసుబ్రహ్మణ్యం ముఖ్య అతిథులుగా, గౌరవ న్యాయ నిర్ణేతలుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ, కథలు చెప్పడం ఒక అద్భుతమైన కళ అని, ఇది విద్యార్థుల్లో సృజనాత్మకత, ఊహాశక్తి, ఆత్మవిశ్వాసం, భావవ్యక్తీకరణ సామర్థ్యాలను పెంపొందించేందుకు ఎంతో దోహదపడుతుందని అన్నారు. ప్రస్తుత ప్రపంచానికి ఎంతో కీలకమైన సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను విద్యార్థులు కథల రూపంలో ఎంచుకుని, వాటిని సృజనాత్మకంగా ప్రదర్శించిన తీరు అభినందనీయమని ప్రశంసించారు.

తీవ్ర పోటీ నడుమ సాగిన ఈ ఇంగ్లీష్ కథల పోటీలలో దిగువమాఘం అమర రాజా విద్యాలయం విద్యార్థిని బి. వైష్ణవి ప్రథమ బహుమతి సాధించగా, కరకంబాడి అమర రాజా విద్యాలయం విద్యార్థిని సి. దేవసు వర్షిణి ద్వితీయ బహుమతి, శ్రీసాయి ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ విద్యార్థిని సి. ఝాన్సీ తృతీయ బహుమతిని గెలుచుకున్నారు.

విజేతలుగా నిలిచిన విద్యార్థులకు ముఖ్య అతిథులు బహుమతులు, ప్రశంసా పత్రాలను అందజేసి ప్రత్యేకంగా అభినందించారు.

ఈ కార్యక్రమంలో అమర రాజా విద్యాలయం ప్రిన్సిపాల్ శ్రీమతి గ్లోరి దేవ ప్రియ, వైస్ ప్రిన్సిపాల్ శ్రీమతి పూజ, ఉపాధ్యాయ బృందం, వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొని ‘కథోత్సవ్–2026’ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *