గంగవరం, సెప్టెంబర్ 1 మన ద్యాస

గంగవరం మండలంలోని జడ్పీ ఉన్నత పాఠశాల, గంగవరం నందు ఏపీ ఓపెన్ స్కూల్ విద్యా విధానంపై మండల స్థాయి ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఓపెన్ స్కూల్ జిల్లా కోఆర్డినేటర్, అసిస్టెంట్ కమిషనర్ డా. వి. జయప్రకాష్ నాయుడు పాల్గొని మండల విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులకు ఏపీ ఓపెన్ స్కూల్ ఎస్‌ఎస్‌సీ, ఇంటర్మీడియట్ 2026 అడ్మిషన్లపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా డా. జయ ప్రకాష్ నాయుడు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఏపీ ఓపెన్ స్కూల్ ద్వారా 10వ తరగతి, ఇంటర్మీడియట్‌లో అడ్మిషన్ పొంది కోర్సులు పూర్తి చేసుకోవచ్చని ప్రభుత్వం అందించే సర్టిఫికెట్లను ఉన్నత విద్యతో పాటు ఉద్యోగ అవకాశాలకు వినియోగించుకోవచ్చని తెలిపారు.గ్రామీణ ప్రాంతాల్లో చదువును మధ్యలో నిలిపివేసిన యువతీ యువకులు, విద్యను కొనసాగించలేకపోయిన వారు, పై చదువులకు వెళ్లాలనుకునే వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మండల విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు తమ పరిధిలో విద్యకు దూరంగా ఉన్న వారిని గుర్తించి ఏపీ ఓపెన్ స్కూల్‌లో నమోదు చేయించాలని కోరారు. విస్తృతంగా నమోదు కార్యక్రమాన్ని చేపట్టి రాష్ట్రస్థాయిలో ఏపీ ఓపెన్ స్కూల్ నమోదు శాతాన్ని ముందంజలో నిలపడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.10వ తరగతిలో ప్రవేశానికి రికార్డు షీట్ లేదా టీసీ లేదా జనన ధ్రువీకరణ పత్రంతో అడ్మిషన్ పొందవచ్చని తెలిపారు. ఇంటర్మీడియట్‌లో ప్రవేశానికి టీసీ, కుల ధ్రువీకరణ పత్రం, మార్కుల జాబితా, ఆధార్ కార్డు తదితర ధ్రువపత్రాలతో అడ్మిషన్ పొందవచ్చని వివరించారు.ఏపీ ఓపెన్ స్కూల్ పరిధిలో ప్రభుత్వ, ప్రైవేటు అధ్యయన కేంద్రాలు ఉన్నాయని, విద్యార్థులు సమీప అధ్యయన కేంద్రాలను సందర్శించి పూర్తి వివరాలు తెలుసుకుని అడ్మిషన్ పొందాలని సూచించారు. అడ్మిషన్ పొందిన విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అమరావతి–గుంటూరు నుంచి నేరుగా వారి చిరునామాకు పంపిస్తారని తెలిపారు. పరీక్ష ఫీజు, హాల్‌టికెట్ తదితర వివరాల కోసం సంబంధిత స్టడీ సెంటర్‌ను సంప్రదించాలని సూచించారు.ఏపీ ఓపెన్ స్కూల్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ఒరిజినల్ సర్టిఫికెట్లను అమరావతి–గుంటూరు నుంచి నేరుగా పోస్టు ద్వారా వారి చిరునామాకు పంపిస్తారని డా. జయప్రకాష్ నాయుడు తెలిపారు. 2026 విద్యా సంవత్సరానికి ఏపీ ఓపెన్ స్కూల్‌లో 10వ తరగతి, ఇంటర్మీడియట్ అడ్మిషన్లు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *