మన ధ్యాస ,నిజాంసాగర్ ,కామారెడ్డి, ఆగస్టు 7:
ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్‌తో చేపట్టిన పెన్‌డౌన్, షట్‌డౌన్ కార్యక్రమంతో కామారెడ్డి జిల్లాలో ఉపాధి హామీ సేవలు స్తంభించిపోయాయి. గత వారం రోజులుగా ఉద్యోగులు విధులకు దూరంగా ఉండటంతో మండల స్థాయిలో ఉపాధి హామీ పథకానికి సంబంధించిన పరిపాలనా కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.ఉపాధి హామీ పథకంలో మండల స్థాయిలో ఏపీవోలు, ఈసీలు, టీఏలు, కంప్యూటర్ ఆపరేటర్లు, ఔట్సోర్సింగ్ సిబ్బంది చాలాకాలంగా విధులు నిర్వహిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పనుల గుర్తింపు, పనులకు అంచనాల తయారీ, మస్టర్ల నిర్వహణ, కూలీల వేతనాల చెల్లింపులకు సంబంధించిన ప్రక్రియలు వీరి పర్యవేక్షణలోనే కొనసాగుతున్నాయి. ఉద్యోగుల నిరసనతో ఈ కార్యకలాపాలకు బ్రేక్ పడింది.
ప్రధాన డిమాండ్లు ఇవే..తమకు పే స్కేల్ వర్తింపజేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ప్రతి నెల మొదటి వారంలో వేతనాలు చెల్లించాలని ఉద్యోగులు కోరుతున్నారు. అంతేకాకుండా అర్హత, అనుభవానికి అనుగుణంగా పదోన్నతులు కల్పించి క్యాడర్ ఫిక్సేషన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.గత ప్రభుత్వాల హయాంలోనూ తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కూడా తమ డిమాండ్ల పరిష్కారం కోసం పలుమార్లు విజ్ఞప్తులు చేశామని ఉద్యోగ సంఘాల నాయకులు తెలిపారు. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరిస్తామని హామీలు ఇచ్చినప్పటికీ, ఇప్పటివరకు పే స్కేల్, ఉద్యోగ భద్రత వంటి ప్రధాన సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
పనులు నిలిచిపోవడంతో ఇబ్బందులు
ఉద్యోగుల పెన్‌డౌన్ కారణంగా జిల్లాలో ఉపాధి హామీ పనులకు సంబంధించిన కొత్త పనుల అంచనాలు, రికార్డుల నిర్వహణ, కూలీల వేతనాల ప్రక్రియ, పనుల పర్యవేక్షణ వంటి అనేక కార్యక్రమాలు నిలిచిపోయాయి. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పనులపై ఆధారపడుతున్న కూలీలకు కూడా ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి ఏర్పడింది.
తమ సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించి, పే స్కేల్‌తో పాటు ఉద్యోగ భద్రత, పదోన్నతులు, క్యాడర్ ఫిక్సేషన్ వంటి డిమాండ్లపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని ఉద్యోగ సంఘాల నాయకులు కోరుతున్నారు. సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వచ్చే వరకు పెన్‌డౌన్, షట్‌డౌన్ నిరసన కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో ఏపీవో శివకుమార్,టెక్నికల్ అసిస్టెంట్లు చంద్రశేఖర్, ప్రభాకర్, ప్రవీణ్, కంప్యూటర్ ఆపరేటర్స్ గంగరాజు, వరప్రసాద్,తదితరులు ఉన్నారు.