రేణిగుంట ఆగష్టు 6(తిరుపతి జిల్లా): తిరుపతి జిల్లా రేణిగుంట మండలం జి.పాలెం గ్రామపంచాయతీ పరిధిలోని నల్లపాళ్యం అంగన్వాడీ కేంద్రంలో ‘తల్లిపాల వారోత్సవాలు’ అత్యంత ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా అంగన్వాడీ వర్కర్ యం. బాలగురువమ్మ మాట్లాడుతూ తల్లిపాలు బిడ్డకు ప్రకృతి ప్రసాదించిన అమృతం లాంటివని, బిడ్డ శారీరక, మానసిక ఎదుగుదలకు ఇవే ఎంతో ప్రధానమైనవని వివరించారు. బిడ్డ పుట్టిన వెంటనే ఇచ్చే ముర్రు పాలు బిడ్డలో రోగనిరోధక శక్తిని పెంచి మొదటి టీకాలా రక్షణ అందిస్తాయని, ప్రతి తల్లి తప్పనిసరిగా ఆరు నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే పట్టాలని ఆమె సూచించారు. అనంతరం ఆశా కార్యకర్తలు కె. ఉమామహేశ్వరి, టి. సుమలత, యస్. సుమలతలు పాల్గొని గర్భిణులు, బాలింతలకు పోషకాహార విలువలు మరియు శుభ్రతపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక బాలింతలు, గర్భిణులు మరియు గ్రామీణ మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

