రేణిగుంట ఆగష్టు 5.
ప్రపంచ తల్లి పాల వారోత్సవాల సందర్భంగా రేణిగుంట మండల వైద్యాధికారి డాక్టర్ చక్రపాణి ఆదేశాల మేరకు హెల్త్ సూపర్వైజర్ కామరాజు తూకివాకం గ్రామంలోని ఎస్.ఆర్. పట్టెడ అంగన్వాడీ కేంద్రంలో తల్లి పాల ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమం మరియు ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా హెల్త్ సూపర్వైజర్ కామరాజు మాట్లాడుతూ,పుట్టిన గంటలోపే శిశువుకు తల్లి పాలు పట్టించడం ఎంతో ముఖ్యమని తెలిపారు. మొదటి ఆరు నెలల పాటు శిశువుకు తల్లి పాలు మాత్రమే ఇవ్వాలని,నీరు లేదా ఇతర ఆహారం అవసరం లేదని వివరించారు.ఆరు నెలల తర్వాత పోషకాహారంతో పాటు రెండేళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం తల్లి పాలను కొనసాగించాలని సూచించారు.తల్లి పాలు శిశువుకు సంపూర్ణ పోషకాహారాన్ని అందించడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచి వివిధ అంటువ్యాధుల నుంచి రక్షిస్తాయని తెలిపారు.అలాగే తల్లులకు కూడా తల్లి పాలివ్వడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని చెప్పారు.
ఈ సందర్భంగా విద్యార్థులు,అంగన్వాడీ సిబ్బంది,ఆశా కార్యకర్తలు మరియు గ్రామస్థులతో కలిసి తల్లి పాల ప్రాముఖ్యతను తెలియజేస్తూ అవగాహన ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు తల్లి పాలపై సందేశాలతో కూడిన ప్లకార్డులను ప్రదర్శిస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో సబ్యూనిట్ ఆఫీసర్ వెంకటయ్య, అంగన్వాడీ సిబ్బంది శంకరమ్మ,హెల్పర్,ఆశా కార్యకర్త గీతాంజలి,గ్రామ ప్రజలు,తల్లులు, బాలింతలు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. తల్లి పాలతోనే ఆరోగ్య వంతమైన సమాజ నిర్మాణం సాధ్యమని ఆరోగ్య శాఖ అధికారులు పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *