మన ధ్యాస, నెల్లూరు,ఆగస్టు 2 : నెల్లూరులోని రోటరీ క్లబ్ కళ్యాణ మండపంలో ఎంవి రావు ఫౌండేషన్, అర్థాల అల్లెయ్య చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో జాతీయ స్వాతంత్ర సమరయోధుల జాతీయ పురస్కారాల ప్రదానోత్సవం ఆదివారం వైభవంగా నిర్వహించారు. దివంగత పింగళి వెంకయ్య జయంతి, అర్థాల అల్లెయ్య వర్ధంతిని పురస్కరించుకుని నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి కళాకారులు, సేవా సంస్థల ప్రతినిధులు, ఉపాధ్యాయులు, సామాజిక సేవకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన ప్రముఖులకు జాతీయ పురస్కారాలు, జ్ఞాపికలు (మెమెంటోలు), ప్రశంసాపత్రాలు అందజేసి ఘనంగా సత్కరించారు. పురస్కార గ్రహీతలను శాలువాలతో సన్మానించి వారి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో భాగంగా సంగీత, నృత్య, సాంస్కృతిక ప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. పలువురు కళాకారులు తమ ప్రదర్శనలతో సభకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పురస్కారాలు అందుకున్న వారు మాట్లాడుతూ, కళాకారులను, సేవా రంగంలో విశేష కృషి చేస్తున్న వ్యక్తులను గుర్తించి ప్రోత్సహిస్తున్న ఎంవి రావు ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలా మోహన్ కృష్ణ, అర్థాల అల్లెయ్య చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ అర్థాల కేశవులుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇటువంటి కార్యక్రమాలు సమాజానికి స్ఫూర్తినిచ్చేలా ఉంటాయని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ఎంవి రావు ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలా మోహన్ కృష్ణ, కార్యదర్శి ఎం. విజయలక్ష్మి, అర్థాల అల్లెయ్య చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ అర్థాల కేశవులు, ట్రస్ట్ మరియు ఫౌండేషన్ సభ్యులు, వివిధ రాష్ట్రాలకు చెందిన కళాకారులు, సామాజిక సేవకులు, ఆహ్వానితులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *