14 గ్రామాల ఇలవేల్పు.. స్వయంభూ తూకివాక గంగమ్మ జాతర మహోత్సవాలు. దిగ్విజయం…
భక్తిశ్రద్ధలతో ముగిసిన తూకివాక గంగమ్మ తల్లి మూడు రోజుల పొంగళ్ళ జాతర….

రేణిగుంట జులై 15.
​తిరుపతి జిల్లా రేణిగుంట మండలం, తూకివాక గ్రామంలో స్వయంభువుగా వెలసిన శ్రీ శ్రీ శ్రీ తూకివాక గంగమ్మ తల్లి మూడు రోజుల పొంగళ్ళ జాతర మహోత్సవాలు భక్తిశ్రద్ధలతో, అత్యంత వైభవంగా ముగిశాయి. సుమారు వెయ్యి సంవత్సరాల పురాతన చరిత్ర కలిగిన ఈ ఆలయంలో పూర్వం ఒక కూలి వారి కుటుంబం ఇంటి పొయ్యిలో గంగమ్మ తల్లి స్వయంభువుగా వెలిశారు. చుట్టుపక్కల 14 గ్రామాల ఇలవేల్పుగా వెలసిన ఈ అమ్మవారి మహిమల వల్ల భక్తుల కష్టాలు తీరుతాయని, విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకుంటారని మరియు సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తుల బలమైన నమ్మకం.
​ఈ ఆలయ అభివృద్ధికి దాత టి. సుభాష్ చంద్రబోస్ నూతన నిర్మాణాన్ని చేపట్టగా, ప్రస్తుతం ఆలయ ధర్మకర్త, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి టి. సునీల్ కుమార్ ఆలయ ప్రగతికి ఎంతో కృషి చేస్తున్నారు. శాస్త్రోక్తంగా జరిగిన ఈ ఉత్సవాల్లో మొదటి రోజు ముద్ర మైలుముగ్గు, రెండో రోజు పోతురాజు ముగ్గు వేయగా, చివరి రోజున భక్తులు వేల సంఖ్యలో పోటెత్తి కోలాహలంగా పొంగళ్ళు సమర్పించారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని తాగునీరు, నిరంతర అన్నదాన సౌకర్యాలను ఆలయ కమిటీ పకడ్బందీగా ఏర్పాటు చేసింది. ధర్మకర్త టి. సునీల్ కుమార్ పర్యవేక్షణలో కమిటీ సభ్యులు అహర్నిశలు శ్రమించి ఈ జాతర మహోత్సవాన్ని దిగ్విజయం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *