మన ధ్యాస ,నిజాంసాగర్ ,మహమ్మద్ నగర్: మండలంలోని హసన్‌పల్లి గ్రామ శివారులోని సర్వే నంబర్ 70/1లో ఉన్న 1.20 ఎకరాల ప్రభుత్వ భూమి వద్ద రెవెన్యూ శాఖ అధికారులు సోమవారం హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేశారు. ప్రభుత్వ భూమిని ఎవరైనా అక్రమంగా ఆక్రమించేందుకు లేదా వినియోగించేందుకు ప్రయత్నిస్తే శాఖాపరమైన చర్యలతో పాటు చట్టపరమైన చర్యలు కూడా తప్పవని తహసీల్దార్ లత హెచ్చరించారు.
హసన్‌పల్లి గ్రామస్థులు ప్రభుత్వ భూమి ఆక్రమణపై 03-11-2025న బాన్సువాడ సబ్ కలెక్టర్‌కు, అనంతరం 23-03-2026న మహమ్మద్ నగర్ తహసీల్దార్‌కు సామూహికంగా ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులపై స్పందించిన రెవెన్యూ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి, జీపీఎస్ సర్వే నిర్వహించారు. సర్వేలో 1.20 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైనట్లు గుర్తించి, ఆ భూమిని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకున్నారు. అనంతరం భవిష్యత్తులో ఎలాంటి ఆక్రమణలు జరగకుండా హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా తహసీల్దార్ లత మాట్లాడుతూ, ప్రభుత్వ భూములను పరిరక్షించడం రెవెన్యూ శాఖ ప్రధాన బాధ్యత అని తెలిపారు. సంబంధిత వ్యక్తులకు ముందుగానే ప్రభుత్వ భూమిలో వరి నాట్లు వేయవద్దని సూచించినప్పటికీ నిబంధనలు ఉల్లంఘించి సాగు చేయడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు వివరించారు.
హెచ్చరిక బోర్డును తొలగించడం, ప్రభుత్వ భూమిని మళ్లీ ఆక్రమించేందుకు ప్రయత్నించడం లేదా ఎలాంటి అనధికార కార్యకలాపాలకు పాల్పడినా సంబంధిత వ్యక్తులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ హెచ్చరించారు.ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం రెవెన్యూ అధికారులు నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తున్నారని, ప్రభుత్వ భూముల ఆక్రమణలకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే ప్రజలు రెవెన్యూ అధికారులకు తెలియజేసి సహకరించాలని తహసీల్దార్ లత విజ్ఞప్తి చేశారు.

By RAHEEM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *