సైబర్ నేరాలు, గంజాయి వినియోగంపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. సీఐ మంజునాథరెడ్డి, ఎస్ఐ హరీష.
గాజులమండ్యం / రేణిగుంట:
తిరుపతి జిల్లా రేణిగుంట మండలం గాజులమండ్యం పోలీస్ స్టేషన్ పరిధిలోని గాంగుంట గ్రామంలో “పల్లెనిద్ర” కార్యక్రమాన్ని నిర్వహించారు. గాజులమండ్యం సీఐ మంజునాథరెడ్డి మరియు ఎస్ఐ హరీష తమ సిబ్బందితో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొని, గ్రామ ప్రజలతో రాత్రి సమయం గడిపారు. ఈ సందర్భంగా గ్రామంలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు మహిళల భద్రత, చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, మహిళల రక్షణ కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘శక్తి యాప్’ విశిష్టతను వివరించారు. ఆపదలో ఉన్న మహిళలు తక్షణ సహాయం కోసం స్మార్ట్‌ఫోన్‌లలో ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని, అత్యవసర సమయాల్లో ఉచిత హెల్ప్‌లైన్ నెంబర్లు 100 లేదా 112 కు ఫోన్ చేసి పోలీసుల సహాయం పొందవచ్చని సూచించారు. సమాజానికి పీడగా మారిన గంజాయి వినియోగం, రవాణాపై ఉక్కుపాదం మోపుతామని, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు.
అదేవిధంగా, ప్రస్తుత రోజుల్లో పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, బ్యాంక్ వివరాలు, ఓటీపీలు ఎవరికీ చెప్పకూడదని కోరారు. ఒకవేళ సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 నెంబరుకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు. వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, హెల్మెట్ ధరించాలని విజ్ఞప్తి చేశారు. గ్రామాల్లో ఎలాంటి అనుమానాస్పద వ్యక్తులు సంచరించినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని అధికారులు కోరారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.

