టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడు కి సిఐటియు నాయకుల వినతి.

స్విమ్స్ ఆసుపత్రిలో పనిచేస్తున్న వార్డు బాయ్‌ల న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కరించి, సమ్మె సందర్భంగా అధికారులు ఇచ్చిన రాతపూర్వక హామీలను అమలు చేయాలని కోరుతూ సోమవారం సాయంత్రం తిరుమలలోని టీటీడీ చైర్మన్ కార్యాలయంలో టీటీడీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ బిఆర్ . నాయుడు కి సిఐటియు నాయకులు వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కందారపు మురళి, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు దడాల సుబ్బారావు మాట్లాడుతూ, స్విమ్స్ ఆసుపత్రిలో గత 33 సంవత్సరాలుగా సేవలందిస్తున్న వార్డు బాయ్‌లు 2023లో శ్రీ లక్ష్మీ శ్రీనివాస మ్యాన్‌పవర్ కార్పొరేషన్‌లో విలీనం చేసిన సమయంలో “శానిటేషన్” హోదాలో నమోదు చేయడం వల్ల తీవ్రమైన అన్యాయానికి గురవుతున్నారని వివరించారు. దీంతో వారికి తగిన వేతనాల పెంపు, ఇతర సౌకర్యాలు అందడం లేదని తెలిపారు.

ఈ సమస్యల పరిష్కారం కోసం కార్మికులు గతంలో 85 రోజులపాటు రిలే నిరాహార దీక్షలు నిర్వహించారని, ఆ సందర్భంగా టీటీడీ యాజమాన్యం మూడు నెలల్లో సమస్యలను పరిష్కరిస్తామని రాతపూర్వకంగా హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. ఆ హామీని గౌరవించి కార్మికులు దీక్షలను విరమించిన నేపథ్యంలో, ఇప్పుడు ఇచ్చిన హామీలను అమలు చేసి వార్డు బాయ్‌ల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరారు.

మంగళవారం జరిగే టీటీడీ ట్రస్ట్ బోర్డు సమావేశంలో ఈ అంశాన్ని చర్చించి, వార్డు బాయ్‌లకు న్యాయం జరిగేలా సానుకూల నిర్ణయం తీసుకోవాలని చైర్మన్‌ను కోరినట్లు నాయకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో సిఐటియు నగర ఉపాధ్యక్షులు కే. వేణుగోపాల్, స్విమ్స్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి జి. రవి, అధ్యక్షులు వి. సూరి, నాయకులు జయమ్మ, జనార్ధన్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *