ప్రత్యేక ఓటరు జాబితా సవరణలో ప్రతి అర్హ ఓటరు భాగస్వామి కావాలి
డోర్ టు డోర్ ఎన్యూమరేషన్ ప్రక్రియ రేపటితో పూర్తి
పారదర్శకమైన, ఖచ్చితమైన ఓటర్ల జాబితా రూపకల్పనే లక్ష్యం
— జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్
రేణిగుంట / తిరుపతి, జూలై 13:
ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR 2026) కార్యక్రమంలో భాగంగా తిరుపతి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డా. ఎస్. వెంకటేశ్వర్ బుధవారం ఉదయం రేణిగుంట గ్రామ సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అన్ని రాజకీయ పార్టీల బూత్ లెవల్ ఏజెంట్లు ( బి ఎల్ ఎ లు), బూత్ లెవల్ అధికారులు ( బి ఎల్ ఓ లు) పరస్పర సమన్వయంతో పనిచేసి పారదర్శకమైన ఓటరు జాబితాను సిద్ధం చేయాలని ఆయన దిశా నిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గత 30 రోజులుగా సాగుతున్న ఇంటింటి ఓటరు ఎన్యూమరేషన్ ప్రక్రియ రేపటితో ముగుస్తుందని, జిల్లాలో ఇప్పటికే 99.5 శాతం డిజిటలైజేషన్ పూర్తయిందని వెల్లడించారు. ఈ ప్రత్యేక సవరణలో భాగంగా మరణించిన, వలస వెళ్లిన, నకిలీ ఓటర్లను గుర్తించి తొలగిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓటు హక్కు ఉండటం చట్టరీత్యా నేరమని, అలాంటి వారు స్వచ్ఛందంగా ఒక చోట ఓటును తొలగించుకోవాలని సూచించారు.
జూలై 21న ముసాయిదా (డ్రాఫ్ట్) ఓటర్ల జాబితాను ప్రచురిస్తామని, జాబితాతో లింకేజీ లేని వారికి నోటీసులు జారీ చేసి, ఈసీ సూచించిన 11 రకాల గుర్తింపు పత్రాల పరిశీలన అనంతరం పేర్లను ఖరారు చేస్తామని తెలిపారు. అనంతరం జూలై 21 నుంచి ఆగస్టు 20 వరకు క్లెయిమ్స్, అభ్యంతరాల స్వీకరణ ఉంటుందని, కొత్త ఓటు నమోదు కోసం ఫారం-6, వివరాల సవరణ లేదా చిరునామా మార్పు కోసం ఫారం-8 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు. ఎలాంటి లోపాలు లేని విశ్వసనీయమైన ఓటర్ల జాబితా రూపకల్పనే తమ లక్ష్యమని ఆయన పునరుద్ఘాటించారు. ఈ తనిఖీలో శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి, తహసీల్దార్ శ్రావణ్ కుమార్, డీటీ దిలీప్ కుమార్ మరియు సిబ్బంది పాల్గొన్నారు

