తిరుపతి:
ధ్యానంతోనే ఆరోగ్యకరమైన, ఆనందకరమైన జీవితానికి నాంది పలుకుదామని తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు పిలుపునిచ్చారు. తిరుపతి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా పరేడ్ మైదానంలో “హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్” (ధ్యాన) కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. పోలీసు సిబ్బందిలో శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతత, ఒత్తిడి నియంత్రణ మరియు విధి నిర్వహణలో సామర్థ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ స్వయంగా యోగా, ధ్యాన సాధనల్లో పాల్గొని సిబ్బందిలో సరికొత్త ఉత్సాహాన్ని నింపారు. అనంతరం ఆయన సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ.. పోలీస్ శాఖలో విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బంది నిరంతరం ప్రజా సేవలోనే నిమగ్నమై ఉంటారని పేర్కొన్నారు. విధి నిర్వహణలో నిరంతరం బిజీగా ఉండటం వల్ల చాలామంది తమ సొంత ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసే పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఆరోగ్యం అనేది ప్రతి ఒక్కరికీ అత్యంత విలువైన సంపద అని, ముఖ్యంగా సుదీర్ఘ సమయం విధుల్లో గడిపే పోలీస్ సిబ్బంది ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడం అత్యంత అత్యవసరమని ఎస్పీ స్పష్టం చేశారు. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని కూడా సమానంగా కాపాడుకోవాలని ఆయన సూచించారు.
డిపార్ట్మెంట్లో ఎవరైనా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లయితే, యోగా మరియు ధ్యానాన్ని తమ దైనందిన జీవితంలో తప్పనిసరిగా భాగం చేసుకోవాలని కోరారు. సిబ్బంది ఆరోగ్యంగా, ఉత్సాహంగా, చలాకీగా ఉన్నప్పుడే సమాజానికి మరింత సమర్థవంతమైన సేవలు అందించగలరని, పోలీస్ సిబ్బంది ఆరోగ్యం బాగుంటేనే ప్రజలకు మరింత మెరుగైన రక్షణ, సేవలు అందుతాయని ఎస్పీ వివరించారు.
ఈ విశేష కార్యక్రమంలో అదనపు ఎస్పీలు వెంకట రావు (పరిపాలన), రవి మనోహరచారి (శాంతి భద్రతలు), శ్రీనివాసులు (క్రైమ్స్), సబ్ డివిజన్ డీఎస్పీలు, పోలీస్ సిబ్బందితో పాటు హార్ట్ఫుల్నెస్ సంస్థ ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని ధ్యాన సాధన

