తిరుపతి:
తిరుపతి పరిధిలోని చిరు వ్యాపారులకు ఆహార భద్రతపై అవగాహన కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ఆహార భద్రతా విభాగం మరియు జాతీయ వీధి వ్యాపారుల సంక్షేమ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో రెండు రోజుల ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. తిరుమలలోని సుమారు 350 మంది చిరు వ్యాపారులతో పాటు తిరుపతిలో జరిగిన కార్యక్రమంలో వంద మంది వ్యాపారులు పాల్గొన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ధ్రువీకరణ పత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా ఆహార నియంత్రణ అధికారి జి. వెంకటేశ్వరరావు, ఆరోగ్య అధికారి అన్వేష్ రెడ్డి, ఆహార భద్రతా అధికారులు ఎన్. మద్దులేటి, ఆర్. జగదీష్‌లు మాట్లాడుతూ.. ప్రజలకు సురక్షితమైన, నాణ్యమైన ఆహారాన్ని అందించడం ప్రతి వ్యాపారి బాధ్యత అని పేర్కొన్నారు. వంటగదిని ప్రతిరోజూ శుభ్రం చేసుకోవాలని, వారానికి ఒకసారి పురుగుల నివారణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఆహార తయారీకి తాగునీరు మాత్రమే వాడాలని, ముడి పదార్థాలు, వండిన ఆహారాన్ని వేర్ވެరుగా ఉంచాలని సూచించారు. వేడి పదార్థాలను 60 డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గకుండా సరఫరా చేయాలన్నారు. సిబ్బంది అంతా పరిశుభ్రమైన దుస్తులు, చేతి తొడుగులు, తలకప్పులు ధరించాలని, చెత్త కోసం మూత ఉన్న డబ్బాలు వాడాలని స్పష్టం చేశారు. ప్రతి హోటల్ నందు ప్రభుత్వ అనుమతి పత్రాన్ని స్పష్టంగా ప్రదర్శించడంతో పాటు, ఫిర్యాదుల పుస్తకాన్ని అందుబాటులో ఉంచాలని అధికారులు వెల్లడించారు.

