తిరుపతి, జూన్ 05: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రేణిగుంట (తూకివాకం) సమీపంలో తుడా ఆధ్వర్యంలో నిర్వహించిన వనమహోత్సవం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్, జాయింట్ కలెక్టర్ ఆర్. గోవింద రావు, తుడా చైర్మన్ సి. దివాకర్ రెడ్డి కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. కేవలం మొక్కలు నాటడమే కాకుండా వాటికి నీరు పోసి, ఎరువులు వేసి సంరక్షించినప్పుడే ఆశించిన ఫలితం ఉంటుందన్నారు. ఎల్ నినో ప్రభావంతో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న తరుణంలో, వాతావరణ మార్పులను తట్టుకోవడానికి ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ‘సీడ్ పెల్లెట్స్’ (విత్తన గుళికల) కార్యక్రమాన్ని ప్రారంభించారని, దీని ద్వారా తక్కువ నీటితోనే మొక్కల జీవన శాతాన్ని పెంచవచ్చని పేర్కొన్నారు. శేషాచలం అడవుల తరహాలోనే రాష్ట్రవ్యాప్తంగా పచ్చదనాన్ని పెంపొందించడానికి విద్యార్థులు, యువత చిన్నతనం నుంచే మొక్కలు నాటడాన్ని ఒక అలవాటుగా మార్చుకోవాలని పిలుపునిచ్చారు.

​జాయింట్ కలెక్టర్ ఆర్. గోవింద రావు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ తమ వృత్తితో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఇళ్లు, పాఠశాలలు, ఖాళీ స్థలాలలో మొక్కలు నాటాలని, ఏదైనా కారణంతో చెట్లు నరకాల్సి వస్తే దానికి బదులుగా మరిన్ని కొత్త మొక్కలు నాటి ప్రకృతి సమతుల్యతను కాపాడాలన్నారు. అనంతరం తుడా ఛైర్మన్ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ.. కాలుష్య నివారణకు సౌరశక్తి, బ్యాటరీ వాహనాల వినియోగం వైపు అడుగులు వేయాలన్నారు. దేశాన్ని రక్షించే సైనికుల్లాగే, యువత కూడా తమ పరిసరాల పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ కోసం నడుం బిగించాలని పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *