తిరుపతి మే 24.

ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ ఇంధన పొదుపుపై దృష్టి సారించాలని శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి కోరారు. ఇంధనాన్ని ఆదా చేయడం ద్వారా దేశ భవిష్యత్తుకు తోడ్పడాలని ఆయన పిలుపునిచ్చారు.

​ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్ నుండి తన కుటుంబ సభ్యులతో కలిసి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలులో ఎమ్మెల్యే తిరుపతికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.

ప్రధాని పిలుపుతోనే ఈ ప్రయాణం:

భవిష్యత్తులో దేశం ఇంధన కొరతను ఎదుర్కోకూడదనే దూరదృష్టితో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కీలక ప్రసంగం చేశారని, దానిని స్ఫూర్తిగా తీసుకునే తాను ఈరోజు రైలు ప్రయాణాన్ని ఎంచుకున్నానని సుధీర్ రెడ్డి తెలిపారు. వ్యక్తిగత వాహనాలను వాడటం కంటే ప్రజా రవాణా వ్యవస్థలను ఉపయోగించడం వల్ల ఇంధనం ఆదా అవుతుందని ఆయన పేర్కొన్నారు.

కార్యకర్తల్లో మార్పు కోసమే:

“మనం మారితేనే సమాజంలో మార్పు వస్తుంది. వాహనదారుల్లో, ముఖ్యంగా కూటమి కార్యకర్తల్లో ఇంధన పొదుపు పట్ల అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే నేను నా కుటుంబంతో కలిసి రైలులో ప్రయాణించాను” అని ఎమ్మెల్యే వివరించారు. ప్రతి ఒక్కరూ సాధ్యమైనంత వరకు ఇంధనాన్ని పొదుపు చేసి, పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *