తిరుపతి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు రేణిగుంట సబ్ డివిజన్ పరిధిలో గంజాయి విక్రేతలు, వినియోగదారుల కదలికలపై నిఘా ఉంచామని రేణిగుంట డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. ‘డ్రగ్స్ పై దండయాత్ర 2.0′ కార్యక్రమంలో భాగంగా మంగళవారం రేణిగుంటలో గంజాయి అలవాటు ఉన్న అనుమానితులకు ప్రత్యేక కిట్ల ద్వారా పరీక్షలు నిర్వహించారు.ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ… గతంలో గంజాయి కేసుల్లో నిందితులుగా ఉన్నవారు, గంజాయి విక్రయించే పెడ్లర్స్, అలాగే వినియోగదారుల కన్జ్యూమర్స వివరాలను సేకరించి, వారిని పిలిపించి ఎన్టీఆర్ కూడలి వద్ద’బయో-చెక్’ కిట్ల ద్వారా పరీక్షలు చేస్తున్నట్లు వెల్లడించారు.అనుమానితుల నుంచి సేకరించిన నమూనాలను ఈ కిట్ ద్వారా పరీక్షించి గంజాయి వాడుతున్నారా లేదా అనేది నిర్ధారిస్తారు.ఈ పరీక్షల్లో పాజిటివ్ వచ్చిన వారి ద్వారా గంజాయి నెట్‌వర్క్‌కు సంబంధించిన ఫార్వర్డ్, బ్యాక్ వర్డ్ లింకులను ఐడెంటిఫై చేసి అదుపులోకి తీసుకుంటామన్నారు.గంజాయికి బానిసలైన వారిని ఆ అలవాటు నుంచి దూరం చేసేందుకు వారి తల్లిదండ్రుల అంగీకారంతో కౌన్సిలింగ్ ఇస్తామని చెప్పారు.పాపానాయుడుపేటలోని ‘రాస్’ సంస్థ పునరావాస కేంద్రం, అలాగే స్విమ్స్,రుయా ఆసుపత్రిలోని డీ-అడిక్షన్ సెంటర్ల ద్వారా వారికి విముక్తి కలిగించేందుకు పోలీస్ శాఖ కృషి చేస్తుందని తెలిపారు.
సమాజంలో గంజాయి మహమ్మారిని నిర్మూలించేందుకు ఈ తనిఖీలు మరియు పరీక్షలు నిరంతరం కొనసాగుతాయని, గంజాయి రహిత సమాజ స్థాపనే లక్ష్యంగా పోలీస్ శాఖ పనిచేస్తోందని డీఎస్పీ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రేణిగుంట సీఐ జయచంద్ర, మరియు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
