శెట్టిపల్లి ప్రాంతంలో ఇంటి పట్టాల పంపిణీ, మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది
*:రాష్ట్ర రెవెన్యూ, స్టాంపులు & రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్*
- 70 ఏళ్ల శెట్టిపల్లి భూ సమస్యకు ముగింపు – 2048 లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ ప్రారంభం*
*రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణ*
శెట్టిపల్లి ప్రజల దశాబ్దాల కష్టానికి రాష్ట్ర ప్రభుత్వం ముగింపు పలికింది
*జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్*
ముఖ్యమంత్రి సంకల్పంతో శెట్టిపల్లి భూ లబ్ధిదారులకు రూ.17.50 కోట్ల రిజిస్ట్రేషన్ ఫీజు మాఫీ
*తుడా ఛైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి*
ఈ-డిప్ ద్వారా పారదర్శకంగా 1711 లబ్ధిదారులకు భూ కేటాయింపు
*:జాయింట్ కలెక్టర్ ఆర్. గోవింద రావు*
తిరుపతి, మే 18: శెట్టిపల్లి ప్రాంతంలో ఇంటి పట్టాల పంపిణీ, మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని జిల్లా ఇంచార్జ్ మంత్రి, రాష్ట్ర రెవెన్యూ, స్టాంపులు & రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ పేర్కొన్నారు.
సోమవారం తిరుపతి నగరంలోని కచ్చపి ఆడిటోరియంలో శెట్టిపల్లి ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమంలో మంత్రుల సమక్షంలో లబ్ధిదారులకు ఇంటి పట్టాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, శ్రీకాళహస్తి, చంద్రగిరి, గూడూరు, సూళ్లూరుపేట, నగరి ఎంఎల్ఏ లు బి.సుధీర్ రెడ్డి, పులివర్తి నాని, పాసం సునీల్ కుమార్, డా. విజయశ్రీ, గాలి భాను ప్రకాశ్, తుడా ఛైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి, ఏపీ యాదవ్ కార్పొరేషన్ ఛైర్మన్ జి.నరసింహ యాదవ్, టిటిడి బోర్డు మెంబర్ డా. పనబాక లక్ష్మి, ఏపీ గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్ ఎం.సుగుణమ్మ, జిల్లా కలెక్టర్ డా. ఎస్.వెంకటేశ్వర్, జాయింట్ కలెక్టర్ మరియు తుడా విసి ఆర్.గోవిందరావు, ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మండలి చైర్మన్ డాక్టర్ శ్రీహరి రావు, మాజీ మంత్రి డా. పరసారత్నం, ఏపీ హస్తకళల కార్పొరేషన్ చైర్మన్ డా.పి. హరిప్రసాద్, వన్నె కుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ సి.ఆర్. రాజన్, ఏపీ నాయీబ్మహణ కార్పొరేషన్ చైర్మన్ ఆర్ .సదాశివం, శెట్టిపల్లి గ్రామ లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా ఇంచార్జ్ మంత్రి, రాష్ట్ర రెవెన్యూ, స్టాంపులు & రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర పేద ప్రజలకు సొంతింటి కలను సాకారం చేయడం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, పేదల సంక్షేమం, గృహ నిర్మాణం, మౌలిక వసతుల అభివృద్ధి, జీవన ప్రమాణాల పెంపు లక్ష్యంగా అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రతి పేద కుటుంబానికి భద్రతతో కూడిన నివాస వసతి కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఇల్లు అనేది ప్రతి కుటుంబానికి గౌరవప్రదమైన జీవనానికి పునాది అని, అందుకే అర్హులైన పేదలకు ఇంటి స్థలాలు, గృహ నిర్మాణ సదుపాయాలు కల్పించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. శెట్టిపల్లి ప్రాంతంలో అర్హత కలిగిన లబ్ధిదారులను పారదర్శకంగా గుర్తించి ఇంటి పట్టాలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. భూ సంబంధిత సమస్యలను వేగంగా పరిష్కరించి పేదలకు హక్కులు కల్పించడంలో రెవెన్యూ శాఖ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. గ్రామాలు, పట్టణాల్లో భూముల రికార్డులను క్రమబద్ధీకరించి ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తోందన్నారు. ఇంటి పట్టాలు పొందిన లబ్ధిదారులు ప్రభుత్వంపై నమ్మకంతో ముందుకు సాగాలని, ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని మంత్రి హామీ ఇచ్చారు. ఇంటి స్థలం మాత్రమే కాకుండా అవసరమైన మౌలిక వసతులు, రహదారులు, తాగునీరు, విద్యుత్ వంటి సదుపాయాలను కూడా దశలవారీగా అభివృద్ధి చేస్తామన్నారు. పేదల అభ్యున్నతే ప్రభుత్వ ధ్యేయమని, అర్హులైన ఒక్క కుటుంబం కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాల నుండి దూరం కాకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని ప్రాంతాల్లో కూడా ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమాలను నిర్వహిస్తామని వెల్లడించారు.
రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పి. నారాయణ మాట్లాడుతూ దాదాపు 70 సంవత్సరాలు పైగా శెట్టిపల్లి భూ సమస్య 2014 సం. లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి రాగా సమస్యను వెంటనే పరిష్కరించాలని ఆదేశించగా సర్వే చేయడం జరిగిందన్నారు. అనంతరం 2024 లో తిరిగి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత సమస్యను పరిష్కరించాలని రాష్ట్ర రెవెన్యూ మంత్రి అనగాని సత్య ప్రసాద్ కు సూచించగా వెంటనే జిల్లా కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేశారన్నారు. దీని ఫలితంగా శెట్టిపల్లికి చెందిన 2,048 లబ్ధిదారులకు రిజిష్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించామన్నారు. ఈ సమస్య కు పరిష్కారం అందించిన ముఖ్యమంత్రి స్థాయి నుండి మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. తన స్వంత నియోజకవర్గం లో కూడా 40 సం. లకు పైగా ఉన్న భూ సమస్యలను కూడా ముఖ్యమంత్రి పరిష్కరించారన్నారు. అదే విధంగా రాష్ట్రంలో ఇటువంటి సమస్య ఎక్కడున్నా దాన్ని భూ సమీకరణ విధానంలో వెంటనే పరిష్కరించేందుకు చర్యలు చేపట్టారన్నారు. ఇదే విధానం లో విశాఖపట్నం సమస్యలను పరిష్కరిస్తున్నామన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ శెట్టిపల్లి ప్రజల దశాబ్దాల కష్టానికి రాష్ట్ర ప్రభుత్వం ముగింపు పలుకుతూ భూ సమస్యను పరిష్కరించిందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంకల్పంతో 2018లో ప్రారంభమైన ఈ సమస్య ఎనిమిది సంవత్సరాల తర్వాత విజయవంతమైందన్నారు. రెండు వేలకుపైగా కుటుంబాలు బాధపడుతున్న ఈ సమస్యను భూ సమీకరణ విధానంలో పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారన్నారు. ఈ సమస్యకు సంబంధించి ఫైల్ మంత్రివర్గ సమావేశంలో ఐదు సార్లు చర్చకు వెళ్ళిందని, అలా వెళ్ళిన ప్రతిసారి మంత్రివర్యులు, ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారన్నారు. రెవెన్యూ, మున్సిపల్ శాఖల ఉన్నతాధికారులు, తుడా చైర్మన్, స్థానిక ప్రజాప్రతినిధులు అందరూ కలిసి కృషి చేయడం వల్లే ఈరోజు ప్రజలకు రిజిస్ట్రేషన్ పత్రాలు అందించగలిగామన్నారు. ప్రత్యేకంగా రెవెన్యూ శాఖ సహకారం, మున్సిపల్ శాఖ మార్గదర్శకత్వం, తుడా చైర్మన్ సూచనలు, మాస్టర్ ప్లాన్ లే అవుట్ రూపకల్పనలో అనుభవం కలిగిన వారితో ఈ ప్రాజెక్ట్ ఒక మాడెల్ టౌన్ షిప్ రూపంలో అమలు చేయబడిందన్నారు. వాస్తు, పార్కులు, రోడ్లు, పాఠశాలలు, వాణిజ్య స్థలాలు అన్నీ సమగ్రంగా పరిగణనలోకి తీసుకొని ప్రణాళిక రూపొందించారన్నారు. ఈ విజయవంతమైన పరిష్కారం, రాజకీయ సంకల్పం మరియు అధికారుల కృషి కలిసినప్పుడు ఏ సమస్యనైనా పరిష్కరించగలమనే ఒక మంచి ఉదాహరణగా నిలిచిందన్నారు. తిరుపతి జిల్లాలో మిగతా భూ సమస్యలను కూడా త్వరలో పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.
తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ భారతదేశం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రగతి పథం లో నడిపిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రి వర్గం, తిరుపతి జిల్లా ఎం ఎల్ ఏ లు, జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఇతర ప్రజా ప్రతినిధులు, తుడా అధికారులు, ఇతర సంబంధిత అధికారుల సహకారం తో శెట్టి పల్లి భూ సమస్యలకు పరిష్కారం లభించిందన్నారు. శెట్టిపల్లి సమస్య 1979 లో ప్రారంభం అయ్యిందని, ఈ సమస్య 2017 సంవత్సరంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి వెళ్ళిన తరువాత 2018 సంవత్సరంలో ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి చెప్పిన మాట ప్రకారం 2024 సం.లో ప్రభుత్వం ఏర్పడిన అనంతరం అతి తక్కువ కాలంలోనే సమస్య పరిష్కారానికి కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సమస్య పరిష్కారం లో జిల్లా ఇంచార్జ్ మంత్రి, మున్సిపల్ శాఖ మంత్రులు రాత్రింబవళ్ళు కష్టపడ్డారన్నారు. 2025 సెప్టెంబర్ లో అధికారికంగా క్యాబినెట్ లో ఆమోదించడం జరిగిందన్నారు. భూ రిజిష్ట్రేషన్ ఫీజు భరించలేమన్న పేదవర్గాల వారి వినతిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళగా 2026 నూతన సంవత్సరం కానుకగా సుమారుగా రూ.17.50 కోట్ల రిజిష్ట్రేషన్ ఫీజును మాఫీ చేశారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా జనవరి 15న ఈ-డిప్ లాటరీ విధానంలో పారదర్శకంగా ప్లాట్ ల కేటాయింపు చేపట్టామన్నారు. రోడ్లు, డ్రైనేజి, త్రాగు నీరు వంటి మౌలిక సదుపాయాలను వీలైనంత త్వరగా ఏర్పాటు చేస్తామన్నారు.
జాయింట్ కలెక్టర్ ఆర్. గోవిందరావు మాట్లాడుతూ ఈ-డిప్ ద్వారా ముఖ్యమంత్రి 1,711 మంది లబ్ధిదారులకి రాండమైజేషన్ విధానం లో పారదర్శకంగా భూ కేటాయింపులు జరిపారని తెలిపారు. అందులో హౌస్ సైట్స్ 1,432 మరియు అగ్రికల్చర్ సైట్స్ 279 అన్నారు. తదుపరి 2026 మార్చి 19 ఉగాది పర్వదినాన 337 మందికి కలెక్టరేట్ లో ఈ – డిప్ విధానంలో కలెక్టర్, తుడా ఛైర్మన్, తిరుపతి ఎమ్మెల్యే ఆధ్వర్యంలో శెట్టిపల్లి ప్రజల సమక్షం లో ప్లాట్ ల కేటాయింపు చేపట్టామన్నారు. పైసా ఖర్చు లేకుండా రూ.17.50 కోట్ల రిజిష్ట్రేషన్ ఫీజు భరిస్తూ లబ్ధిదారులకు అందజేయడం జరిగిందన్నారు. తుడా, రిజిష్ట్రేషన్ సిబ్బంది, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్, ముగ్గురు సబ్ రిజిస్ట్రార్స్ సాధారణ పరిపాలన అధికారులు, ల్యాండ్ అక్విజిషన్ ఆఫీసర్, తుడా సెక్రటరీ , సిపిఓ , కలెక్టరేట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అందరూ బృందాలుగా ఏర్పడి, ఎవరికీ ఇబ్బంది లేకుండా మొత్తం 2,048 మంది లబ్ధిదారులలో 1,534 మంది రిజిస్ట్రేషన్ పేపర్స్ తయారు చేసి, 1,431 మందికి రిజిస్ట్రేషన్స్ చేయడం జరిగిందన్నారు.










