రేణిగుంట: రైలు ప్రయాణంలో జరిగిన ఒక దురదృష్టకర ఘటనలో ఓ యువకుడు తన కాలును కోల్పోయిన సంఘటన రేణిగుంటలో చోటు చేసుకుంది.
స్థానిక వసుంధర నగర్ సమీపంలోని రైల్వే ట్రాక్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళితే.. గణేష్ (30) అనే యువకుడు రైలులో తిరుపతికి ప్రయాణిస్తున్నాడు. రైలు వసుంధర నగర్ ప్రాంతంలో వెళ్తుండగా, ప్రమాదవశాత్తు జారి కింద పడిపోయాడు. ఈ క్రమంలో రైలు చక్రాలు యువకుడి కాలుపై నుండి వెళ్లడంతో ఒక కాలు పూర్తిగా తెగిపోయింది.
ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. తీవ్ర రక్తస్రావంతో ఉన్న బాధితుడిని చికిత్స నిమిత్తం తిరుపతిలోని ఎస్వీఆర్ఆర్ (రుయా) ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. రైల్వే పోలీసులు ఘటనపై సమాచారం సేకరిస్తున్నారు.

