మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ప్రజలకు పిలుపునిచ్చారు. బిచ్కుంద మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా మొహమ్మద్ ముజాహిద్‌ను కాంగ్రెస్ పార్టీ బలపరిచిందని తెలిపారు. ఆయనను గెలిపించడం ద్వారా వార్డు అభివృద్ధికి మరింత ఊపునిచ్చే అవకాశం ఉంటుందని అన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు 7వ వార్డులో ఇంటింటా తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. ప్రజలను ప్రత్యక్షంగా కలుసుకుని, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతు తెలపాలని కోరారు. గతంలో కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించి, రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చేయడానికి తమ పార్టీ కట్టుబడి ఉందని తెలిపారు.
మున్సిపల్ పాలనలో కాంగ్రెస్ పార్టీకి అవకాశం కల్పిస్తే, పట్టణ అభివృద్ధి, మౌలిక వసతుల విస్తరణ, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ప్రతి కార్యకర్త, నాయకుడు సమిష్టిగా కృషి చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్‌తో పాటు స్థానిక నాయకులు, కార్యకర్తలు మరియు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.