
‘అంతిమ యాత్ర’ ఇబ్బందులు…
అత్తూరు కాలనీవాసుల కష్టాలకు చెక్…
క్షేత్రస్థాయి రికార్డులను పరిశీలించిన తహశీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి…
రేణిగుంట మన ద్యాస ఫిబ్రవరి 4.
రేణిగుంట మండల పరిధిలోని అత్తూరు ఎస్సీ కాలనీలో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న శ్మశాన వాటిక దారి సమస్యపై మండల తహశీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించి బుధవారం క్షేత్రస్థాయిలో పర్యటించారు. కాలనీ వాసుల విన్నపం మేరకు స్వయంగా క్షేత్రస్థాయికి చేరుకున్న ఆయన, శ్మశాన వాటికకు వెళ్లే మార్గంలో ఉన్న ఆటంకాలను మరియు భూమి రికార్డులను నిశితంగా పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలతో మాట్లాడి, అంతిమ యాత్రల సమయంలో వారు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రెవెన్యూ రికార్డుల ప్రకారం దారికి సంబంధించిన సరిహద్దులను వెంటనే గుర్తించాలని సంబంధిత సర్వేయర్లను మరియు సిబ్బందిని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల కనీస అవసరాలను తీర్చడం ప్రభుత్వ బాధ్యతని, ముఖ్యంగా శ్మశాన వాటిక వంటి సామాజిక అంశాలలో దారి సమస్య లేకుండా చూడటమే తమ ప్రాధాన్యతని పేర్కొన్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు త్వరితగతిన నివేదిక సిద్ధం చేయాలని, ఎవరికీ ఇబ్బంది కలగకుండా చట్టపరమైన నిబంధనలకు లోబడి త్వరలోనే దారి సౌకర్యాన్ని కల్పిస్తామని ఆయన స్థానికులకు హామీ ఇచ్చారు.