మన ధ్యాస, నెల్లూరు,జనవరి 14 :నెల్లూరు నగరంలోని మైపాడు గేట్ సెంటర్ వద్ద కొలువై ఉన్న శ్రీ భ్రమరాంబికా సమేత మల్లికార్జున స్వామి వారి వార్షిక తెప్పోత్సవ ఏర్పాట్లను రాష్ట్ర మంత్రి వర్యులు పొంగురు నారాయణ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా పెన్నానది వద్ద ఉన్న ఘాట్‌ను, భక్తుల రాకపోకలకు ఉద్దేశించిన మార్గాలను అధికారులతో కలిసి ఆయన తనిఖీ చేశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…….కీలక అంశాలను వెల్లడించారు..ప్రతి ఏటా మైపాడు గేట్ సెంటర్లో తెప్పోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుందని, ఈ ఏడాది సుమారు లక్ష మందికి పైగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని మంత్రి పేర్కొన్నారు.భక్తుల రద్దీ దృష్ట్యా ఎక్కడా తొక్కిసలాట జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. భద్రతా పరంగా ఎటువంటి లోటుపాట్లు ఉండకూడదని స్పష్టం చేశారు.2014లో తాను మంత్రిగా ఉన్న కాలంలోనే భక్తుల సౌకర్యార్థం ఇక్కడ ఘాట్ ఏర్పాటు చేశామని గుర్తు చేస్తూ, పెన్నా నదిలో స్వామి అమ్మవార్ల జలవిహారాన్ని భక్తులు ప్రశాంతంగా వీక్షించేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు.ఉత్సవ సమయంలో మైపాడు గేట్ సెంటర్లో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ మార్గాలను సిద్ధం చేయాలని పోలీసు శాఖను ఆదేశించారు.భక్తులందరూ స్వామివారి కృపకు పాత్రులు కావాలని, ఉత్సవాన్ని విజయవంతం చేసేందుకు అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి నారాయణ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కమిషనర్ నందన్ ఇంచార్జ్ మేయర్ రూప్ కుమార్ యాదవ్, ఆర్డీవో అనూష, డీఎస్పీ శ్రీనివాసులు రెడ్డి..వివిధ శాఖల అధికారులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.




