మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):జుక్కల్ నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల సమస్యలపై చర్చించేందుకు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (MRPS) అధ్యక్షుడు మందకృష్ణ మాదిగను జుక్కల్ ఎమ్మెల్యే తోటలక్ష్మీకాంతారావు శనివారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ కూడా ఎమ్మెల్యేతో పాటు ఉన్నారు.మందకృష్ణ మాదిగతో జరిగిన భేటీలో ఎమ్మెల్యే నియోజకవర్గ అభివృద్ధి అంశాలు, సామాజిక న్యాయం, ప్రజా సంక్షేమం, మరియు వెనుకబడిన వర్గాల సమస్యలపై విస్తృతంగా చర్చించారు. జుక్కల్ నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్ అయినప్పటికీ ఇంకా పలు గ్రామాలు అభివృద్ధి దిశగా వెనుకబడి ఉన్నాయని ఎమ్మెల్యే తెలిపారు. విద్య, వైద్యం, రహదారులు, తాగునీరు, ప్రాథమిక సౌకర్యాల లేమి వంటి అంశాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం కోసం ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, సామాజిక నాయకులు సమిష్టిగా కృషి చేయాలని మందకృష్ణ మాదిగ మరియు ఎమ్మెల్యే అభిప్రాయపడ్డారు. నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తామని ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు హామీ ఇచ్చారు.









